మహారాష్ట్రలో నాన్‌డెయిరీ లేదా ఆర్టిఫిషియల్ పనీర్‌పై నిషేధం విధించడంతో ఈ ఉత్పత్తిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో తక్కువ ధరలకు లభించే పనీర్‌ను కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అసలైన పనీర్‌కు, కృత్రిమంగా తయారు చేసిన పనీర్‌కు మధ్య తేడాను గుర్తించడం, నాణ్యతను పరిశీలించడం, కొనుగోలు చేసే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యమని చెబుతున్నారు.


సంప్రదాయ పాలతో తయారు చేసే పనీర్‌కు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో లభిస్తున్న పాలేతర పనీర్‌ (Non-Dairy/Analogue Paneer) తయారీ, విక్రయం, నిల్వ, పంపిణీపై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంది. ప్రజారోగ్యాన్ని కాపాడటంతో పాటు, ఉత్పత్తుల స్వభావంపై వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడకుండా చూడటం, వారిని తప్పుదోవ పట్టించే విక్రయ విధానాలను అరికట్టడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశాలుగా తెలుస్తోంది.

భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) నిబంధనల ప్రకారం.. తగిన లేబులింగ్‌తో ఆర్టిఫిషియల్ పనీర్‌ను చట్టబద్ధంగా విక్రయించవచ్చు. అయితే, కొన్ని చోట్ల ఈ ఉత్పత్తిని సంప్రదాయ పాలతో తయారు చేసిన పనీర్‌గా విక్రయిస్తూ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి మోసాలను అరికట్టడంతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిషేధ నిర్ణయం తీసుకున్నాయి.

ఏంటీ ఆర్టిఫిషియల్‌ లేదా అనలాగ్‌ పనీర్‌?

సాధారణ పనీర్‌ను తాజా పాలను నిమ్మరసం లేదా సిట్రిక్‌ యాసిడ్‌ వంటి పదార్థాలతో విరిచించి, గడ్డకట్టించడం ద్వారా తయారు చేస్తారు. అయితే, ఆర్టిఫిషియల్‌ లేదా అనలాగ్‌ పనీర్‌ తయారీలో పామాయిల్‌ వంటి వృక్షజన్య కొవ్వులు, పాలపొడి, మిల్క్‌ సాలిడ్స్‌, స్టార్చ్‌, ఎమల్సిఫైయర్లు వంటి పదార్థాలను ఉపయోగిస్తారు. వీటిని అసలైన పనీర్‌ మాదిరిగా కనిపించేలా, రుచి, ఆకారం దగ్గరగా ఉండేలా తయారు చేస్తారు. సాధారణ పాల పనీర్‌తో పోలిస్తే వీటి తయారీ ఖర్చు తక్కువగా ఉండటంతో మార్కెట్‌లోనూ తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. అయితే, రెండింటి తయారీ విధానం, పదార్థాలు వేర్వేరుగా ఉంటాయి. అందువల్ల కొనుగోలు చేసేటప్పుడు ప్యాకెట్‌పై ఉన్న లేబుల్‌, పదార్థాల వివరాలను పరిశీలించడం ముఖ్యం.

ఎందుకు నిషేధం?

మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ప్రకారం.. ఆర్టిఫిషియల్ పనీర్‌ను సంప్రదాయ పాలతో తయారైన పనీర్‌గా విక్రయించడం ఆహార భద్రతా ప్రమాణాల చట్టం-2006కు విరుద్ధం. ఇలా విక్రయించడం ద్వారా వినియోగదారులను తప్పుదోవ పట్టించడమే కాకుండా, వారు సరైన ఆహార ఎంపిక చేసుకునే అవకాశాన్ని కూడా దెబ్బతీస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం జరిమానాలు విధించడంతో పాటు, నేర తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.

అసలు పనీర్‌కు, ఆర్టిఫిషియల్ పనీర్‌కు తేడా ఏంటి?

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. సంప్రదాయ పనీర్‌ను పాలతో తయారు చేస్తారు. ఇందులో ప్రొటీన్, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ బీ12 వంటి పోషకాలు ఉంటాయి. అయితే ఆర్టిఫిషియల్ లేదా అనలాగ్ పనీర్ తయారీలో పాలకు బదులుగా పామాయిల్ వంటి వృక్షజన్య నూనెలు, స్టార్చ్ తదితర పదార్థాలను ఉపయోగించవచ్చు. అందువల్ల వీటిలోని ప్రొటీన్, కాల్షియం, విటమిన్ బీ12 వంటి పోషకాల పరిమాణం సంప్రదాయ పనీర్‌తో పోలిస్తే తక్కువగా ఉండవచ్చు. అలాగే పామాయిల్ వినియోగం వల్ల సంతృప్త కొవ్వుల మోతాదు పెరిగే అవకాశం ఉంది. అయితే పోషకాల పరిమాణం తయారీ విధానం, ఉపయోగించిన పదార్థాలపై ఆధారపడి ఉంటుంది.

ఆర్టిఫిషియల్ పనీర్‌ను గుర్తించడమెలా?

ప్యాకెట్‌పై ఉన్న లేబుల్‌ను, పదార్థాల జాబితాను పరిశీలించడం ద్వారా పనీర్ స్వభావాన్ని తెలుసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ పాల పనీర్‌లో పాలు, సిట్రిక్ యాసిడ్ లేదా ఇతర ఆహార ఆమ్లాలు ఉండవచ్చు. అదే అనలాగ్ పనీర్‌లో పామాయిల్, ఇతర వృక్షజన్య నూనెలు, స్టార్చ్ వంటి పదార్థాలు ఉండే అవకాశం ఉంది. అందుకే కొనుగోలు చేసే ముందు ఉత్పత్తి పేరు, పదార్థాల జాబితా, తయారీదారు వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి.

పనీర్‌పై కొద్దిగా అయోడిన్ ద్రావణం వేస్తే నీలం లేదా నీలం-నలుపు రంగులోకి మారినట్లయితే అందులో స్టార్చ్ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ పరీక్ష స్టార్చ్ ఉనికిని సూచించగలదే తప్ప, ఆ ఉత్పత్తి కచ్చితంగా ఆర్టిఫిషియల్ పనీర్ అని నిర్ధారించలేదు. ఎందుకంటే కొన్ని ఉత్పత్తుల్లో స్టార్చ్ ఉండవచ్చు, మరికొన్నింటిలో ఉండకపోవచ్చు.

అలాగే అసాధారణంగా తక్కువ ధర, రబ్బరు మాదిరిగా ఉండే ఆకృతి, నమిలేటప్పుడు ఎక్కువ గట్టిగా అనిపించడం వంటి లక్షణాలు అనుమానం కలిగించవచ్చు. అయినప్పటికీ, కేవలం ధర, రంగు లేదా ఆకృతిని బట్టి పనీర్ అసలైనదా కాదా అని తేల్చలేం. అనుమానం ఉంటే సంబంధిత ఆహార భద్రతా అధికారులను సంప్రదించడం మంచిది.

వినియోగదారులు పాటించాల్సిన జాగ్రత్తలు:

  • పనీర్‌ను ఎప్పుడూ విశ్వసనీయమైన డెయిరీలు లేదా గుర్తింపు పొందిన సంస్థల నుంచే కొనుగోలు చేయాలి.
  • ప్యాకెట్‌పై ఉన్న పదార్థాల జాబితా, తయారీ వివరాలు, గడువు తేదీని జాగ్రత్తగా పరిశీలించాలి.
  • మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు లభించే పనీర్‌ ఉత్పత్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
  • వీలైనప్పుడు నాణ్యమైన తాజా పాలతో ఇంట్లోనే పనీర్‌ తయారు చేసుకోవచ్చు.
  • మొత్తంగా.. సరైన లేబులింగ్‌, పరిశుభ్రమైన తయారీ విధానాలు పాటించే సంస్థల ఉత్పత్తులను ఎంచుకోవాలి. నాణ్యత, భద్రతకు ప్రాధాన్యమిస్తూ విశ్వసనీయమైన బ్రాండ్ల నుంచి పనీర్‌ను కొనుగోలు చేయడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana