
DNews:04 NOV:హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీని ఎస్‌వోటీ పోలీసులు భగ్నం చేశారు. టీఎన్జీవో కాలనీలోని ఎస్ఎం లగ్జరీ గెస్ట్ రూమ్, కో లివింగ్ గెస్ట్ రూమ్ల్లో జరుగుతున్న డ్రగ్ పార్టీలపై పక్కా సమాచారం ఆధారంగా పోలీసులు దాడి చేసి 12 మందిని అరెస్ట్ చేశారు.
డ్రగ్స్‌ను కర్ణాటక నుంచి తెప్పించి హైదరాబాద్ యువతకు సరఫరా చేస్తున్న స్మగ్లర్ గుత్తా తేజ కృష్ణతో పాటు ఒక నైజీరియన్ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో ఎండీఎంఏ మరియు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం 6 మంది డ్రగ్ పెడ్లర్లు, 6 మంది కన్జ్యూమర్లు ఉన్నారని ఎస్‌వోటీ అధికారులు తెలిపారు. అరెస్టయిన వారిలో గుత్తా తేజ కృష్ణ, సాజీర్, వెన్నెల రవికిరణ్, మన్నే ప్రశాంత్, పి. హర్షవర్ధన్ రెడ్డి, పకనాటి లోకేష్ రెడ్డి, పృథ్వి విష్ణువర్ధన్, కార్ల పొడి వెస్లీ సుజిత్, గుండబోయిన నాగార్జున, మేకల గౌతం, గుంటక సతీష్ రెడ్డి ఉన్నారు.
నిందితులలో ఐటీ ఉద్యోగులు, ఆర్కిటెక్టులు, డ్రైవర్లు, డీజే ప్లేయర్లు, ఫొటోగ్రాఫర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి వద్ద నుంచి ₹6.51 లక్షల విలువ చేసే 31.2 గ్రాముల ఎండీఎంఏ, 3 గ్రాముల గంజాయి, మొబైల్ ఫోన్లు, రెండు బైకులు, డాంగిల్స్, జీపీఎస్ కార్డు రీడర్ స్వాధీనం చేసుకున్నారు.
