
DSports:09 OCT:మకే: ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన రెండు టెస్టుల యువ సిరీస్‌ను ఇండియా అండర్-19 జట్టు 2–0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. రెండో టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసి, భారత యువ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఓవర్‌నైట్ స్కోరు 144/7తో బుధవారం (అక్టోబర్ 8) ఆటను కొనసాగించిన భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకు ఆలౌటై, 36 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు కేవలం 40.1 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది.
ఆసీస్ తరఫున అలెక్స్ లీ యంగ్ (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో కేవలం నలుగురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. భారత బౌలర్లలో హెనిల్ పటేల్, నమన్ పుష్పక్ చెరో మూడు వికెట్లు, ఉధవ్ మోహన్ రెండు వికెట్లు తీసి ఆసీస్‌ను చిత్తు చేశారు.
తర్వాత 81 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన భారత్ కేవలం 12.2 ఓవర్లలోనే 84/3 స్కోరు చేసి సునాయాస విజయం సాధించింది. వేదాంత్ త్రివేది (33 నాటౌట్), విహాన్ మల్హోత్రా (21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
ఈ విజయంతో భారత్ యువ జట్టు టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తూ అద్భుత ప్రదర్శనతో సిరీస్‌ను ముగించింది.
