
DNews Dec18 2025: న్యూఢిల్లీ: తెలంగాణలో విద్యుత్ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కనీసం పాత బకాయిలు తీర్చడానికి కూడా సరిపోదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తెలంగాణ విద్యుత్ పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యుత్ రంగానికి కేటాయించిన రూ. 21 వేల కోట్లు ఏమాత్రం సరిపోవని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. “ఈ నిధులతో పాత బకాయిలు తీరుస్తారా? లేక ఉచిత విద్యుత్ పథకాలకు వినియోగిస్తారా? ప్రభుత్వానికి స్పష్టమైన ప్రణాళిక లేదు” అని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందని, కొత్త ఉత్పత్తిపై దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు.
తెలంగాణను ఇంధన మిగులు రాష్ట్రంగా మార్చాలంటే కేవలం ప్రకటనలు సరిపోవని, క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన మరియు బకాయిల చెల్లింపుపై దృష్టి పెట్టాలని కిషన్ రెడ్డి సూచించారు.
