
D Spiritual: Jan 31: శివలింగం ఆవిర్భావ కథ, బ్రహ్మ–విష్ణువు వివాదం, కాశీ పండిట్ సంజయ్ ఉపాధ్యాయ్ వివరణలు, మహాశివరాత్రి ప్రత్యేకత, అలాగే శివలింగ పూజ విశిష్టతను ఈ కథనం వివరిస్తోంది.
శివలింగాన్ని శివుని ప్రత్యక్ష రూపంగా భావించే సంప్రదాయం భారతదేశంలో శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు, గ్రామాల నుంచి మహానగరాల వరకు శివలింగ పూజ ఒక నిరంతర ఆధ్యాత్మిక ఆచారంగా మారింది. నీరు, పాలు, బిల్వపత్రాలు, భస్మతో శివలింగాన్ని అభిషేకించడం ద్వారా భక్తుల జీవితాల్లోని బాధలు తొలగిపోతాయని, మనసుకు శాంతి లభిస్తుందని గాఢమైన విశ్వాసం ఉంది. అయితే శివలింగం ఎలా ఉద్భవించింది? పురాణాలు దాని గురించి ఏమి చెబుతున్నాయి? అనే ప్రశ్నలకు కాశీకి చెందిన జ్యోతిష్కులు ఆసక్తికరమైన వివరణలు ఇస్తున్నారు.
పురాణాల ప్రకారం శివలింగం ఆవిర్భావానికి సంబంధించిన కథ అత్యంత విశిష్టమైనది. ఒక సందర్భంలో బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఎవరు శ్రేష్ఠుడు, ఎవరు సర్వశక్తిమంతుడు అనే అంశంపై వివాదం తలెత్తిందని చెబుతారు. అదే సమయంలో అకస్మాత్తుగా ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక అగ్నిస్థంభంలా ప్రకాశవంతమైన లింగరూపం ఆవిర్భవించింది. ఆ రూపానికి భూమిలో ఆరంభం కనిపించలేదు, ఆకాశంలో అంతం కనబడలేదు. బ్రహ్మ పైకి, విష్ణువు కిందకు వెళ్లి ఆ అద్భుత రూపానికి మొదలు, ముగింపు కనుగొనడానికి ప్రయత్నించినా విఫలమయ్యారు.
అప్పుడే ఆకాశం నుంచి “నేనే శివుడిని.. నాకు ఆది లేదు, అంతం లేదు” అనే దివ్యవాక్యం వినిపించిందని పురాణాలు చెబుతున్నాయి. వెంటనే శివుడు తన నిజ స్వరూపంలో ప్రత్యక్షమై, సర్వసృష్టికి తానే మూలమని తెలియజేశాడని విశ్వాసం. ఆ లింగరూపమే శివుని నిరాకార, అనంత తత్త్వానికి ప్రతీకగా మారిందని పండితులు వివరిస్తున్నారు.
కాశీకి చెందిన జ్యోతిష్కుడు పండిట్ సంజయ్ ఉపాధ్యాయ్ ప్రకారం, శివుడు శివలింగ రూపంలో ఆవిర్భవించిన దినమే ఫాల్గుణ మాసం కృష్ణ పక్ష చతుర్దశి, అదే మహాశివరాత్రి. ఈ పవిత్ర రాత్రి శివలింగానికి నీరు లేదా పాలు సమర్పిస్తే శివుడు అత్యంత త్వరగా ప్రసన్నుడవుతాడని ఆయన చెబుతున్నారు. ఈ రోజున చేసే పూజలు భక్తుల కోరికలను నెరవేర్చడమే కాకుండా, పాపాల నుంచి విముక్తిని కలిగిస్తాయని విశ్వసిస్తారు.
శివలింగం అనే పదానికీ లోతైన అర్థం ఉంది. ‘శివ’ అంటే కరుణామయుడు, శుభకరుడు అని, ‘లింగ’ అంటే సృష్టికి కారణమయ్యే సంకేతం అని అర్థం. అంటే శివలింగం అనేది సృష్టి, సంరక్షణ, లయలకు ప్రతీకగా భావిస్తారు. అందుకే శివలింగ పూజ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, జీవన తత్వాన్ని గుర్తు చేసే ఆధ్యాత్మిక మార్గంగా నిలుస్తుంది.
మహాశివరాత్రి రోజున శివలింగానికి గంగాజలం, పాలు, తేనె, భస్మ, గంధం, బిల్వపత్రాలు సమర్పించి శోడశోపచార పూజ చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పూజ ద్వారా మనసుకు శాంతి, కుటుంబానికి శ్రేయస్సు, జీవితానికి స్థిరత్వం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే మహాశివరాత్రి రోజున దేశవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ, శివలింగ పూజ ఒక మహోత్సవంలా మారుతోంది.
