
D Spiritual: Nov 18: ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుద్ధ ద్వాదశి రోజున తులసి వివాహం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది క్షీరాబ్ధి ద్వాదశి నవంబర్ 21న జరగనుంది. ఈ పర్వదినాన్ని భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఇళ్లలో జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొన్న తర్వాత జరిగే తొలి శుభకార్యంగా తులసి వివాహాన్ని భావిస్తారు. ఈ రోజున తులసి మొక్కను ఉసిరి చెట్టు కొమ్మతో లేదా శ్రీ మహావిష్ణువు విగ్రహం, సాలగ్రామంతో వివాహం జరిపిస్తారు. తులసి కల్యాణం వెనుక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది.
పురాణ కథనం ప్రకారం.. జలంధరుడు అనే శక్తివంతమైన రాక్షస రాజు ఉండేవాడు. అతడు శ్రీ శివుడి తేజస్సు నుంచి జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఒకసారి ఇంద్రుడు అహంకారంతో శ్రీ శివుడిని అవమానించడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో శివుడు తన మూడో కన్ను తెరవగా, అందులో నుంచి వెలువడిన అగ్నికణం సముద్రంలో పడింది. ఆ అగ్నికణం నుంచే జలంధరుడు జన్మించాడు.
జలంధరుడు తన శక్తితో దేవతలను ఓడించి స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. అతడి దాడులను దేవతలు ఎదుర్కోలేకపోయారు. జలంధరుడికి అపారమైన శక్తి ఉండటానికి అతడి భార్య బృంద పాతివ్రత్యం, శ్రీ మహావిష్ణువుపై ఆమెకున్న అచంచలమైన భక్తి కారణమని దేవతలు గుర్తించారు. బృంద భక్తి కొనసాగినంతకాలం జలంధరుడిని ఓడించడం సాధ్యం కాదని భావించారు.
దీంతో దేవతలంతా శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి జలంధరుడి నుంచి తమను రక్షించాలని వేడుకున్నారు. లోక కల్యాణం కోసం విష్ణుమూర్తి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. జలంధరుడు దేవతలతో యుద్ధానికి వెళ్లిన సమయంలో, విష్ణుమూర్తి అతడి రూపంలో బృంద ముందు ప్రత్యక్షమయ్యారు. తన భర్త తిరిగి వచ్చాడని భావించిన బృంద ఆయనను పూజించింది. దీంతో ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగిందని పురాణ కథనం చెబుతోంది.
మరోవైపు బృంద పాతివ్రత్య బలం తొలగిపోవడంతో యుద్ధంలో జలంధరుడిని శ్రీ శివుడు సంహరించారు. కొంతసేపటికి తన ముందు ఉన్నది భర్త జలంధరుడు కాదని, సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువని బృంద తెలుసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె విష్ణుమూర్తిని రాయిగా మారిపోవాలని శపించింది. బృంద శాపం కారణంగా విష్ణుమూర్తి సాలగ్రామ రూపాన్ని ధరించారని పురాణాల్లో పేర్కొంటారు.
అనంతరం బృంద తన ప్రాణాలను అగ్నికి అర్పించగా, ఆమె బూడిద నుంచి సుగంధభరితమైన తులసి మొక్క ఉద్భవించింది. బృంద భక్తి, త్యాగానికి ముగ్ధుడైన శ్రీ మహావిష్ణువు ఆమెకు వరం ప్రసాదించారు. ఇకపై తులసి రూపంలో తనకు అత్యంత ప్రియమైనదిగా ఉంటావని, తులసి దళాలు లేని పూజను తాను స్వీకరించనని వరమిచ్చినట్లు పురాణ కథనం.
ఈ కారణంగానే ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి రోజున భక్తులు తులసి మొక్కకు, శ్రీ మహావిష్ణువు విగ్రహానికి లేదా సాలగ్రామానికి వివాహం జరిపిస్తారు. ఈ వేడుకనే తులసి కల్యాణం లేదా తులసి వివాహం అని పిలుస్తారు. తులసి కల్యాణం నిర్వహించడం వల్ల వైవాహిక జీవితంలో సుఖసంతోషాలు, సంతాన భాగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
