
D News: బిగ్ బాస్ తమిళ్ 10 హోస్ట్ విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట చర్చకు దారితీశాయి. హౌస్‌లో లీడర్‌షిప్‌పై మాట్లాడిన ఆయన వ్యాఖ్యలను కొందరు రాజకీయ వ్యాఖ్యలతో ముడిపెట్టడంతో సోషల్ మీడియాలో వివాదం మొదలైంది. దీంతో కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న విజయ్ టీవీ తాజాగా దీనిపై వివరణ ఇచ్చింది.
బిగ్ బాస్ హౌస్‌లో లీడర్‌గా ఎంపికైన శతిగ బాధ్యతలను సరిగ్గా నిర్వహించలేకపోయిందనే అంశంపై విజయ్ సేతుపతి స్పందించారు. లీడర్‌షిప్ అంటే కేవలం హామీలు ఇవ్వడం, సమస్యలు వచ్చినప్పుడు ఇతరులపై నిందలు వేయడం కాదనే అర్థంలో ఆయన మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు షోలోని లీడర్‌షిప్ టాస్క్‌కు సంబంధించినవే అయినప్పటికీ.. తమిళనాడు రాజకీయాల్లోని ప్రస్తుత పరిణామాలకు, ముఖ్యంగా నటుడు విజయ్ రాజకీయ ప్రయాణానికి పరోక్షంగా లింక్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేయడం వివాదానికి కారణమైంది.
దీంతో తమిళగ వెట్రి కళగం (TVK) అభిమానులు, విజయ్ అభిమానుల్లో కొందరు విజయ్ సేతుపతిపై విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు రాజకీయ రంగు పులమడం సరికాదంటూ మరో వర్గం నెటిజన్లు స్పందించారు. అసలు వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారనే దానిపై కూడా సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో విజయ్ టీవీ స్పందిస్తూ.. బిగ్ బాస్ తమిళ్ 10 పూర్తిగా వినోదం కోసం రూపొందించిన కార్యక్రమమని స్పష్టం చేసింది. షోలోని పరిస్థితులు, సంభాషణలు, అభిప్రాయాలు, చర్చలు అన్నీ కార్యక్రమంలో భాగంగానే చూడాలని తెలిపింది. వాటిని షోకు వెలుపల ఉన్న వ్యక్తులు, సంస్థలు, సిద్ధాంతాలు లేదా పరిస్థితులకు అన్వయించకూడదని పేర్కొంది.
ఇలా విజయ్ సేతుపతి వ్యాఖ్యలపై మొదలైన వివాదానికి విజయ్ టీవీ వివరణ ఇవ్వడంతో ప్రస్తుతం ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే విజయ్ సేతుపతి వ్యాఖ్యలు నిజంగా రాజకీయ ఉద్దేశంతో చేశారా? లేక బిగ్ బాస్ గేమ్‌లో భాగంగానే మాట్లాడారా? అనే దానిపై సోషల్ మీడియాలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
