
తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మహా వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులు తగ్గుముఖం పట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో నాగార్జునసాగర్‌ను ఈ వైదిక క్రతువుకు వేదికగా ఎంపిక చేశారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు, వేద పండితులు, దేవస్థాన సిద్ధాంతి శాస్త్రోక్తంగా సంప్రదింపులు జరిపి ఆగస్టు 10వ తేదీని శుభ ముహూర్తంగా నిర్ణయించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ డ్యామ్ సమీపంలోని విజయవిహార్ ప్రాంగణంలో ఈ మహా యాగాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట క్షేత్రానికి చెందిన పండితులు, అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య యాగ క్రతువును చేపట్టనున్నారు. ఇందుకోసం యాగ ప్రాంగణంలో ప్రత్యేకంగా 11 హోమకుండాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ మహా వరుణ యాగంలో సుమారు 108 మంది ఋత్వికులు, వేద పండితులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కృష్ణా, గోదావరి నదులకు సమృద్ధిగా వరద నీరు చేరాలని, డ్యామ్‌లు, జలాశయాలు, చెరువులు, కుంటలు నీటితో కళకళలాడాలని యాగంలో సంకల్పం చేయనున్నారు. అన్నదాతల పంటలు సమృద్ధిగా పండాలని, రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ప్రత్యేక వేద ప్రార్థనలు నిర్వహించనున్నారు.
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో మహా వరుణ యాగానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఆగస్టు 10న ఉదయం నుంచి రోజంతా జరిగే ఈ యాగం మధ్యాహ్నం 3:24 గంటలకు నిర్వహించే మహా పూర్ణాహుతితో ముగియనుంది.
పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, జల వనరులు నిండాలని, రైతులకు మంచి దిగుబడులు రావాలని ఆకాంక్షిస్తూ ఈ యాగాన్ని నిర్వహించనున్నారు.
