
D Spiritual: Nov 21: మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు.. వైభవంగా రెండో రోజు వేడుకలు
వెంకటాపురంలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు రెండో రోజు శుక్రవారం భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యాగశాల ద్వారతోరణార్చన, గరుడధ్వజ ప్రతిష్ఠ, శేషవాహన సేవ, ధ్వజారోహణం, బలిప్రదానం, శాత్తుమొర తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
అనంతరం మాధ్యాహ్నిక నివేదన, తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో దేవస్థానం కార్యనిర్వహణాధికారి కొత్తపల్లి వెంకటయ్య, చైర్మన్ తుమ్మల శ్రీనివాస్, ధర్మకర్తలు తుమ్మల కరుణాకర్ రెడ్డి, దామెర అనంతాచారి, కంబాలపల్లి అండాలు, ఆవుల చంద్రకళ, మీసాల ముత్యాలు, కేశిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎస్. నర్సింహ పాల్గొన్నారు.
వీరితో పాటు దేవస్థాన అర్చకులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.
