D News
బెదిరింపులతో తనను ఎవరూ భయపెట్టలేరని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నందున ఆ పదవికి ఉన్న పరిమితులను అర్థం చేసుకుని బాధ్యతగా పనిచేస్తున్నానని తెలిపారు. తనపై ఎవరి ఒత్తిడి లేదని, తనను ఎవరూ ఒత్తిడి చేయలేరని అన్నారు. స్నేహంతో మాత్రమే తనను గెలవగలరని, దోస్తీకి తాను గులామునని పేర్కొన్నారు. చంచల్‌గూడ నుంచి ఐఎస్‌ సదన్‌ కూడలి అవతలి వరకు 3.3 కిలోమీటర్ల పొడవున నాలుగు లైన్ల వెడల్పుతో రూ.620 కోట్ల వ్యయంతో నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని గురువారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం చంచల్‌గూడ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన సభలో సీఎం ప్రసంగించారు.

అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యలకు సీఎం స్పందన

ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి పులిలా ఉండేవారని, దిల్లీ నుంచి వచ్చి బ్రిడ్జి ప్రారంభోత్సవంలో సంతోషంగా పాల్గొన్నారని అన్నారు. అనంతరం వేదికపై ముభావంగా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి.. బెదిరింపులతో తనను ఎవరూ భయపెట్టలేరని స్పష్టం చేశారు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, తనను ఎవరూ ఒత్తిడి చేయలేరని అన్నారు.

ఒవైసీ సోదరులకు రేవంత్‌రెడ్డి కితాబు

అసదుద్దీన్‌, అక్బరుద్దీన్‌ ఒవైసీలకు దేశంపై భక్తి లేదని కొందరు వ్యాఖ్యానిస్తుంటారని సీఎం అన్నారు. అయితే దేశభక్తి విషయంలో వారు మోదీ, అమిత్‌షాలకు ఏమాత్రం తక్కువ కాదని పేర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో సైన్యానికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారని, పాకిస్థాన్‌ కుట్రలను విదేశాల్లోనూ వివరించారని ఒవైసీ సోదరులను రేవంత్‌రెడ్డి ప్రశంసించారు.

పాతబస్తీ హైదరాబాద్‌కు గుండెకాయ

హైదరాబాద్‌ అంటే పాతబస్తీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇదే అసలైన నగరం అని పేర్కొన్నారు. చుడీబజార్‌, పత్తర్‌గట్టీ, మోజంజాహి మార్కెట్‌, కబూతర్‌ఖానా, ఏక్‌మినార్‌, చార్మినార్‌ ప్రాంతాల్లోని మార్కెట్లకు ప్రపంచంలోనే ప్రత్యేకత ఉందన్నారు. 400 ఏళ్ల క్రితం నిజాం నవాబులు ఇలాంటి నగరాన్ని అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. తాను మలక్‌పేట అల్లుడినని, మూసారాంబాగ్‌ శాలివాహననగర్‌కు చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నానని తెలిపారు.

పాతబస్తీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎంపీ అసదుద్దీన్‌, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ తనను కలిసి చేయాల్సిన పనుల జాబితాను ఇచ్చారని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే బలాల కాలేజీ అభివృద్ధికి రూ.20 కోట్లు అడిగారని, తాను రూ.25 కోట్లు ప్రకటిస్తున్నానని చెప్పారు. పాతబస్తీకి మెట్రో కావాలని ఎంపీ అసదుద్దీన్‌ కోరడంతో వెంటనే ఆమోదం తెలిపానన్నారు.

పాతబస్తీకి మెట్రో విస్తరణ

ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో పనులు జరుగుతున్నాయని సీఎం తెలిపారు. త్వరలోనే పాతబస్తీ మీదుగా నాగోల్‌ను, విమానాశ్రయాన్ని కలిపే మెట్రో కారిడార్‌ పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు. దుర్గంచెరువు తీగల వంతెనకు దీటుగా మీరాలం చెరువుపై మూడు కిలోమీటర్ల పొడవైన కేబుల్‌ బ్రిడ్జిని నిర్మిస్తున్నామని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్లకు భూముల కేటాయింపు

యాఖుత్‌పుర, చార్మినార్‌ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం భూములు కేటాయిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మైనారిటీ ప్రజలు అధికంగా నివసించే మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వానికి హిందూ, ముస్లిం అనే వ్యత్యాసం లేదని, అందరూ కలిసుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

మలక్‌పేటలో బిర్యానీపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

మలక్‌పేట తన అత్తారిల్లు అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈసారి మలక్‌పేటకు వచ్చి బిర్యానీ తినకుండా వెళ్తున్నానని అన్నారు. రాబోయే ఎన్నికల్లోపు ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేసి, వాటి ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు బిర్యానీ తిని వెళ్తానంటూ సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.

రేవంత్‌రెడ్డికే మా మద్దతు: అసదుద్దీన్‌

ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ.. తమ మద్దతు రేవంత్‌రెడ్డికే కానీ కాంగ్రెస్‌ పార్టీకి కాదని స్పష్టం చేశారు. చంచల్‌గూడ వంతెన కోసం గత పాలకులు శిలాఫలకం వేశారే తప్ప నిధులు మంజూరు చేయలేదన్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తాము వంతెన నిర్మాణం కోసం కోరగా రూ.600 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.

95 శాతం భూసేకరణ పూర్తయింది: ఒవైసీ

ఫలక్‌నుమా వరకు మెట్రోను వచ్చే ఎన్నికల కంటే ముందే అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. ప్రస్తుతం మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పనులు 95 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో పలువురు ప్రముఖులు

ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అజారుద్దీన్‌, ఎంపీలు వేంనరేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌, రఘువీర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వీహెచ్‌, ఎమ్మెల్యేలు బలాల, దానం నాగేందర్‌, నవీన్‌యాదవ్‌, జాఫర్‌ హుస్సేన్‌, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కర్ణన్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.