The Paradise: Nani Requests Permission to Watch the Film with Fans at RTC Cross Roads

D News: నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 23న ఈ చిత్రానికి ప్రీమియర్ షోలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రేక్షకులతో కలిసి తన సినిమా చూడాలని నాని ఆసక్తి వ్యక్తం చేశారు.

ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలనుకుంటున్న నాని

ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ పోలీసు అధికారులను ట్యాగ్ చేస్తూ నాని ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. చిన్నప్పటి నుంచే సినిమాలను అభిమానించే తనకు.. ప్రేక్షకులతో కలిసి థియేటర్‌లో సినిమా చూడటం ఎంతో ప్రత్యేకమైన అనుభూతి అని నాని పేర్కొన్నారు.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ థియేటర్‌లో ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్‌కు హాజరై, తాము ఎవరి కోసం సినిమా తీశామో ఆ ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడాలని ఉందని తెలిపారు. సినిమా పూర్తయిన తర్వాత ప్రేక్షకుల స్పందనను ప్రత్యక్షంగా అనుభవించడంలోనే నటుడిగా తనకు అసలైన సంతృప్తి లభిస్తుందని నాని చెప్పారు.

భద్రతకు తొలి ప్రాధాన్యత

అయితే తన విజ్ఞప్తి నేపథ్యంలో భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని నిబంధనలు, మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తామని నాని స్పష్టం చేశారు. భద్రతకే తమ తొలి ప్రాధాన్యత అని పేర్కొంటూ.. తన విజ్ఞప్తిని సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి, సంబంధిత అధికారులు పరిశీలించి అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన ఈ సినిమాను ప్రేక్షకుల మధ్య కూర్చొని చూడాలన్న నాని కోరికపై ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

By Avinash