D Spiritual: Sept 29: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని నవరాత్రి బ్రహ్మోత్సవాలను మరింత విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.

తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. టీటీడీ జేఈవో శ్రీ ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణలతో కలిసి అదనపు ఈవో అధికారులతో పలు అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు పూర్తయిన నేపథ్యంలో కేవలం 17 రోజుల వ్యవధిలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు.

సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ విభాగాల పనితీరుపై సేకరించిన ఫీడ్‌బ్యాక్, చెక్‌లిస్ట్‌లను విభాగాల వారీగా సమీక్షించినట్లు తెలిపారు. ఎక్కడైనా లోపాలు గుర్తించిన చోట వాటిని సరిదిద్దడంతో పాటు, నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో మరింత మెరుగైన సమన్వయంతో పనిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌లో అన్నప్రసాదం, విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణతో పాటు పలు విభాగాల పనితీరుపై 95 నుంచి 98 శాతం వరకు సంతృప్తి వ్యక్తమైనట్లు అదనపు ఈవో తెలిపారు. ఈ అనుభవాలను ఆధారంగా చేసుకుని నవరాత్రి బ్రహ్మోత్సవాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.

నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో పూర్తిస్థాయిలో సెలవులు ఉండటంతో గత బ్రహ్మోత్సవాలతో పోలిస్తే మరింత మంది భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నమోదైన భక్తుల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని అదనంగా సుమారు 20 శాతం మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అందుకు అనుగుణంగా అన్నప్రసాదం, అవసరమైన సామగ్రి, ప్రొక్యూర్‌మెంట్, స్టాకింగ్, రవాణా, లాజిస్టిక్స్ తదితర అంశాల్లో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు ఈవో తెలిపారు.