D Educt: Sept 3: ఉన్నత విద్య బలోపేతమే లక్ష్యం.. మంత్రి నారా లోకేశ్

రాష్ట్రంలో ఉన్నత విద్యను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు అత్యుత్తమ మౌలిక వసతులతో బలంగా ఉన్నాయని.. అదే తరహా విద్యా వాతావరణాన్ని రాష్ట్రంలోనూ కల్పించి ఉన్నత విద్యను పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

యువత నైతిక విలువలతో పాటు కష్టపడే తత్వాన్ని అలవర్చుకున్నప్పుడే జీవితంలో రాణించగలరని లోకేశ్‌ అన్నారు. బుధవారం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో నూతనంగా నిర్మించిన వసతిగృహాలను ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

విద్యా వ్యవస్థలో మార్పులకు కృషి

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో నిపుణులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉన్నప్పటికీ వివిధ కారణాలతో విద్యా వ్యవస్థలు బలహీనపడ్డాయని లోకేశ్‌ పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

గత రెండేళ్లుగా పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టి సారించి ప్రయోగశాలలు, నైపుణ్య కేంద్రాల ఏర్పాటుతో పాటు పరిశ్రమలతో విద్యా సంస్థలను అనుసంధానం చేస్తున్నట్లు వివరించారు.

విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులు రావాలంటే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సమష్టిగా భాగస్వాములు కావాలని లోకేశ్‌ అన్నారు. అందరి సహకారంతోనే విద్యా రంగంలో ఆశించిన మార్పులు సాధ్యమవుతాయని తెలిపారు.

పరిశ్రమలకు అనుగుణంగా విద్య.. కరిక్యులమ్‌లో మార్పులు

రాష్ట్రంలో ఆటోమోటివ్‌ రంగంలో అనేక పరిశ్రమలను తీసుకొచ్చామని లోకేశ్‌ తెలిపారు. యువత ఫిజిక్స్‌, మెటీరియల్‌ సైన్సెస్‌, స్పేస్‌, థర్మోడైనమిక్స్‌ వంటి విభిన్న అంశాలపై కూడా దృష్టి సారించాలని సూచించారు.

పరిశ్రమల నిపుణులతో చర్చించి విద్యా కరిక్యులమ్‌ను కూడా అవసరాలకు అనుగుణంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రతి విశ్వవిద్యాలయానికి ప్లేస్‌మెంట్స్‌కు సంబంధించి ప్రగతి సూచికలను తీసుకువస్తున్నామని వివరించారు. యువత పట్టుదలతో అవకాశాలను అందిపుచ్చుకుని విజయాన్ని సాధించాలని పిలుపునిచ్చారు.

రూ.70 కోట్లతో నూతన వసతిగృహాలు

జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో రూ.70 కోట్ల వ్యయంతో 1,600 మంది విద్యార్థులకు అత్యాధునిక వసతులతో నిర్మించిన గౌతమి, కృష్ణవేణి, నాగార్జున వసతిగృహాలను మంత్రి నారా లోకేశ్‌ ప్రారంభించారు. అనంతరం వసతిగృహాల్లోని సౌకర్యాలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, ఎమ్మెల్యేలు అరవిందబాబు, జీవీ ఆంజనేయులు, బ్రహ్మారెడ్డి, భాష్యం ప్రవీణ్‌, జేఎస్‌టీయూకే వైస్‌ఛాన్స్‌లర్‌ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి

నెల రోజుల్లో జరగనున్న మున్సిపల్‌, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో లోకేశ్‌ పిలుపునిచ్చారు.

జనసేన, బీజేపీలతో కలిసి 2029 ఎన్నికలతో పాటు మరో మూడు ఎన్నికల్లోనూ కూటమిగా ముందుకు వెళ్లి విజయం సాధిస్తామని ఆయన అన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రజలతో నిరంతరం మమేకం కావాలని సూచించారు.

బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసినప్పటికీ వైకాపా నాయకులు కోర్టును ఆశ్రయించి దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని లోకేశ్‌ ఆరోపించారు.

వైకాపాపై లోకేశ్‌ తీవ్ర విమర్శలు

హత్యలు చేయడం, వాటిని రాజకీయంగా ఉపయోగించుకోవడం ‘గొడ్డలి పార్టీ’కి అలవాటుగా మారిందని లోకేశ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలంలో చెన్నారెడ్డి హత్యకు గురైన ఘటనను ప్రస్తావిస్తూ వైకాపా అధినేత జగన్‌పై విమర్శలు చేశారు.

జగన్‌ చెన్నారెడ్డి తండ్రి భాస్కరరెడ్డికి ఫోన్‌ చేసి బ్రహ్మారెడ్డి చంపించాడని అన్నారని, అయితే తన కుమారుడిని గొడ్డలి పార్టీ కార్యకర్తలే చంపారని భాస్కరరెడ్డి చెప్పారని లోకేశ్‌ పేర్కొన్నారు.

బాబాయిని, సొంత పార్టీ కార్యకర్తలను చంపి ఆ నెపాన్ని తమపై వేస్తున్నారని జగన్‌పై ఆరోపణలు చేశారు. జగన్‌ను ‘బడా చోర్‌’గా, కారుమూరి నాగేశ్వరరావును ‘చోటా చోర్‌’గా అభివర్ణించారు. మద్యం రవాణాకు సంబంధించిన అక్రమ సొమ్ము కోడలి ఖాతాలో జమ చేసిన వ్యవహారంలో ఈడీ ఆయన్ను జైలుకు పంపిందని లోకేశ్‌ ఆరోపించారు.

వైకాపా చేస్తున్న దుష్ప్రచారాలను కార్యకర్తలు సమర్థంగా తిప్పికొట్టాలని లోకేశ్‌ సూచించారు. తెలుగుదేశం పార్టీలో వర్గాలు ఉండవని, వర్గాల పేరుతో కావాలనే చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు.

అనంతరం మంత్రి నారా లోకేశ్‌ కోటప్పకొండకు వెళ్లి త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana