
టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తన తొలి చిత్రం ‘పెళ్లి చూపులు’ సాధించిన విజయం, ఆ తర్వాత ఎదుర్కొన్న ఒత్తిడి, నిజమైన స్నేహితుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘ఎన్ఈ రిపీట్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. తన కెరీర్లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.
‘పెళ్లి చూపులు’ సినిమాను ఎలాంటి భారీ అంచనాలు లేకుండా తెరకెక్కించానని తరుణ్ భాస్కర్ తెలిపారు. అయితే ఆ సినిమా ఊహించని స్థాయిలో విజయం సాధించడంతో తనకే ఆశ్చర్యం కలిగిందన్నారు. ‘‘పెళ్లి చూపులు ఎందుకు హిట్ అయిందో, ఎలా అంత పెద్ద విజయం సాధించిందో ఇప్పటికీ నాకు తెలియదు’’ అని సరదాగా వ్యాఖ్యానించారు. వైజాగ్లో ప్రేక్షకుల విజిల్స్, సీడెడ్ ప్రాంతంలో భారీగా అమ్ముడైన టికెట్లు తాను అస్సలు ఊహించలేదని చెప్పారు.
అయితే తొలి సినిమా విజయం తర్వాత తనపై ఒత్తిడి పెరిగిందని ఆయన వెల్లడించారు. పరిశ్రమలో తన తదుపరి సినిమా కూడా అదే స్థాయిలో విజయం సాధించాలని అందరూ ఆశించడంతో ఆ అంచనాలను అందుకోవడం సవాలుగా మారిందన్నారు. గతంలో ఎదురైన వైఫల్యాలు, కొత్తగా వచ్చిన బాధ్యతల మధ్య కొంత ఇబ్బందికి గురయ్యానని వివరించారు.
నిజమైన స్నేహితుల గురించి మాట్లాడుతూ..
తన జీవితంలో కష్టకాలం ఎదురైనప్పుడు ఎవరు నిజమైన స్నేహితులో అర్థమైందని తరుణ్ భాస్కర్ చెప్పారు. ‘పెళ్లి చూపులు’ సినిమాకు ముందు తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఆ సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు సైతం దూరమైన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. కానీ నలుగురు స్నేహితులు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ తనను వదిలిపెట్టలేదన్నారు.
‘‘ఎక్కడికి పోయినా, బురదలో పడ్డా వాడు చెప్పుకి చూయింగ్ గమ్ లెక్క అంటుకొనే ఉంటాడు కానీ ఎక్కడికీ పోడు’’ అంటూ నిజమైన స్నేహితుల గురించి తనదైన శైలిలో వివరించారు. సినిమా విజయం తర్వాత పరిచయమైన వారికంటే, కష్టాల్లో తోడుగా నిలిచిన స్నేహితులే తనకు ఎంతో విలువైనవారని పేర్కొన్నారు.
ఆ స్నేహమే ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు స్ఫూర్తి!
తన స్నేహితులతో ఉన్న అనుబంధం నుంచే ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా ఆలోచన పుట్టిందని తరుణ్ భాస్కర్ వెల్లడించారు. ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా, మనసుకు నచ్చిన విధంగా నిజాయితీతో ఈ సినిమాను రూపొందించానని చెప్పారు.
ఇక ఇప్పుడు ‘ఈ నగరానికి ఏమైంది 2’ తెరకెక్కిస్తున్న నేపథ్యంలో తమ ముందున్న అతిపెద్ద సవాలు ప్రేక్షకుల అంచనాలేనని అభిప్రాయపడ్డారు. మొదటి భాగాన్ని అభిమానులు ఎంతగానో ఆదరించడంతో రెండో భాగంపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయని తెలిపారు.
ఇంజనీరింగ్ తర్వాతే అసలు జీవితం అర్థమైంది!
తన కెరీర్ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత పరిశ్రమలోకి అడుగుపెట్టడం పూర్తిగా భిన్నమైన అనుభవమని తరుణ్ భాస్కర్ అన్నారు. ‘‘ఇంజనీరింగ్ తర్వాత అడల్టింగ్ అనేది చాలా విభిన్నమైన పరిస్థితి’’ అంటూ జీవితంలో ఎదురైన మార్పులను ప్రస్తావించారు.
అలాగే ‘ఎన్ఈ రిపీట్’ ట్రైలర్ను రూపొందించే సమయంలో అది నాస్టాల్జిక్గా ఉండాలా, ఫన్నీగా ఉండాలా, లేక డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలా అనే విషయంపై చాలా చర్చించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తన సినీ ప్రయాణంలోని అనుభవాలను పంచుకుంటూ, స్నేహం, విజయాలు, అపజయాలు తనకు నేర్పిన పాఠాలను వివరించారు.
