
D News: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్ భీమారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించగా.. అదే ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ హామీల అమలుపై నిరసన చేపట్టారు.
భీమారం బస్టాండ్ వద్ద కాంగ్రెస్ సంబరాలు
వెయ్యి రోజుల ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ భీమారం బస్టాండ్ వద్ద సంబరాలు నిర్వహించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ పాలనకు మద్దతుగా నినాదాలు చేశారు.
ప్రభుత్వ హామీల అమలుపై బీఆర్ఎస్ నిరసన
ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యక్రమానికి సమీపంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. వెయ్యి రోజుల పాలన పూర్తయినా ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని వారు ఆరోపించారు.
ఐదు మీటర్ల దూరంలో పోటాపోటీగా నినాదాలు
కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యక్రమాలు కేవలం ఐదు మీటర్ల దూరంలోనే జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలు డీజేలు ఏర్పాటు చేసుకుని పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరస్పరం వాగ్వాదం చోటుచేసుకుంది.
తోపులాట.. రంగంలోకి పోలీసులు
‘డీ అంటే డీ’ అంటూ ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం ముందుకు దూసుకెళ్లడంతో తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న ఏసీపీ నరసింహారావు ఆధ్వర్యంలో స్థానిక ఇన్స్పెక్టర్ రవికుమార్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇరువర్గాలను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు.
నేషనల్ హైవేపై బైఠాయింపు.. ట్రాఫిక్‌కు అంతరాయం
ఇరువర్గాల కార్యకర్తలు నేషనల్ హైవేపై బైఠాయించడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి ట్రాఫిక్‌ను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.
