తెలంగాణలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు విద్యను కొనసాగించే అవకాశం కల్పిస్తూ రాష్ట్ర జైళ్ల శాఖ కీలక కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) సహకారంతో ఖైదీలు పదో తరగతి (SSC), ఇంటర్మీడియట్ కోర్సులు చదివేందుకు వీలుగా ఓపెన్ స్కూలింగ్ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఖైదీల్లో విద్యా స్థాయిని పెంచడంతో పాటు, వారు విడుదలైన తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుంది.

85 మంది ఖైదీలు ఆసక్తి
ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ కార్యక్రమం ద్వారా చదువుకోవడానికి ఇప్పటికే 85 మంది ఖైదీలు ఆసక్తి చూపించారు. వీరిలో 70 మంది పదో తరగతి, మరో 15 మంది ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరేందుకు ముందుకొచ్చారు. వయోపరిమితి లేకుండా అర్హులైన ఖైదీలకు చదువుకునే అవకాశం కల్పిస్తున్నారు.
పుస్తకాలు, తరగతులు.. ఫీజులో రాయితీ
ఈ కార్యక్రమంలో భాగంగా ఖైదీలకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, విద్యా సహాయాన్ని అందించనున్నారు. ప్రతి ఆదివారం, నెలలో రెండో శనివారం తరగతులు నిర్వహిస్తారు. జైలు అధికారుల అవసరాలను బట్టి ఇతర రోజుల్లోనూ తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుంది.
ఖైదీల కోసం జైళ్లలో ప్రత్యేక TOSS కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా కోర్సు ఫీజులో ఒక్కొక్కరికి రూ.1,250 రాయితీ కల్పించనున్నారు. జైళ్లలో గ్రంథాలయాలను ఏర్పాటు చేసి, ఖైదీల్లో పఠనాసక్తిని పెంచేందుకు కూడా చర్యలు తీసుకోనున్నారు.
ఇంటర్ తర్వాత ఉన్నత విద్యకు అవకాశం
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఖైదీలు నిర్దేశిత ప్రవేశ అర్హతలను సాధిస్తే ఉన్నత విద్యను కూడా అభ్యసించవచ్చు. చదువు మధ్యలో ఆగిపోయిన వారు మళ్లీ విద్యను కొనసాగించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది.
ఖైదీల జీవితాల్లో మార్పే లక్ష్యం
విద్య ద్వారా ఖైదీల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరుగుతాయని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా తెలిపారు. జైళ్లను కేవలం శిక్ష అమలు చేసే కేంద్రాలుగా కాకుండా, విద్య, నైపుణ్యాభివృద్ధి, పునరావాసానికి వేదికలుగా మార్చాలన్నదే లక్ష్యమని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా పేర్కొన్నారు.
ఖైదీల పిల్లలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు కొనసాగించలేని పరిస్థితుల్లో ఉంటే వారికి కూడా విద్యా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా ఖైదీలు విద్యార్హతలు పొందడమే కాకుండా, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా తిరిగి స్థిరపడేందుకు అవకాశం లభించనుంది.
