
D NEWS: రాష్ట్రంలో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 22-ఏ భూ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన అర్హత కలిగిన పట్టా భూములకు తగిన నాలా రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు మార్గం సుగమం చేసింది.
ఈ మేరకు రెవెన్యూ శాఖ మెమో నెం. 48062/ULC/A1/2026 ద్వారా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత కలిగిన దరఖాస్తులను నిర్దిష్ట కాలపరిమితిలోగా వేగంగా పరిష్కరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
22-ఏ భూ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలులో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. GHMC, HMDA, DTCP, మున్సిపల్ అనుమతులు ఉన్నప్పటికీ 22-ఏ జాబితాలో ఉన్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు కూడా మార్గం కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది.
జీవో 118, జీవో 76కు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించి దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. గతంలో నాలా ప్రక్రియ పూర్తికాక రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన నివాస పట్టా భూములకు తాజా నిర్ణయంతో పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు.
22-ఏ సమస్యల పరిష్కార ప్రక్రియను ఉన్నతాధికారులు ప్రతిరోజూ సమీక్షించాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అర్హత ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కరించి సేవలు అందించాలని అధికారులను సూచించారు.
