D NEWS: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఆర్థిక సాయం మాత్రమే కాకుండా తులం బంగారం ఇస్తామన్న హామీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో 51 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు అవుతున్నా ఒక్క లబ్ధిదారుడికైనా హామీ ఇచ్చిన తులం బంగారం అందిందా అని ఆయన ప్రశ్నించారు.

వికలాంగుల పెన్షన్లను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామని ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం అమలు చేయలేదని తలసాని విమర్శించారు. కొత్త పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా మంజూర్లు జరగడం లేదని ఆరోపించారు.

డబుల్ బెడ్‌రూం ఇళ్ల విషయంలో లబ్ధిదారుల నుంచి రూ.6 లక్షలు చెల్లించాలని ప్రభుత్వం ప్రతిపాదించడంపైనా ఆయన ప్రశ్నలు సంధించారు. పేద కుటుంబాలు అంత మొత్తం ఎలా సమకూర్చుకుంటాయని, ఎన్నికల మేనిఫెస్టోలో లేని లబ్ధిదారుల వాటాను ఇప్పుడు ఎందుకు తెరపైకి తెస్తున్నారని నిలదీశారు.

ఇంకా నిర్మాణం పూర్తికాని ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక కోసం లాటరీ నిర్వహించడంపైనా తలసాని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది, లబ్ధిదారులకు ఎప్పుడు అందిస్తారనే విషయాలను ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.