Supriya Yarlagadda Joins New CBFC Board: Key Position for Nagarjuna’s Niece

D News: కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ను పునర్వ్యవస్థీకరించింది. 18 మంది సభ్యులతో కొత్త బోర్డును ఏర్పాటు చేస్తూ సెప్టెంబర్ 16న అధికారిక ప్రకటన విడుదల చేసింది. శశి శేఖర్ వేంపతి నేతృత్వంలోని ఈ కొత్త బోర్డులో అక్కినేని కుటుంబానికి చెందిన నిర్మాత, నటి సుప్రియ యార్లగడ్డకు చోటు దక్కింది. ఈ బోర్డు తక్షణమే అమల్లోకి వచ్చి మూడేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగనుంది.

18 మంది సభ్యులతో కొత్త బోర్డు

కొత్త CBFC బోర్డులో సుప్రియతో పాటు బాలీవుడ్ నటులు ప్రీతి జింటా, సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠి, పల్లవి జోషి, మనోజ్ జోషి, బెంగాలీ నటుడు ప్రోసేన్‌జిత్ ఛటర్జీ, టీవీ నటి రూపాలీ గంగూలీ, దర్శకుడు ప్రియదర్శన్, సంగీత దర్శకుడు రిక్కీ కేజ్ తదితరులకు స్థానం లభించింది. సినీ రంగంతో పాటు సంగీతం, సాహిత్యం, థియేటర్, ఫిల్మ్ క్రిటిసిజం వంటి విభాగాలకు చెందిన పలువురిని ఈ బోర్డులోకి తీసుకున్నారు.

నిర్మాతగా సుప్రియకు గుర్తింపు

అక్కినేని నాగార్జున మేనకోడలిగా సినీ ప్రేక్షకులకు పరిచయమైన సుప్రియ.. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి పనిచేశారు. ‘గూఢచారి’తో మరోసారి నటిగా కనిపించిన ఆమె.. ఇటీవల అదివి శేష్, మృణాల్ ఠాకూర్ నటించిన ‘డాకోయిట్’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.

సినిమా నిర్మాణంతో పాటు ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవం ఉన్న సుప్రియకు ఇప్పుడు CBFCలో సభ్యురాలిగా కొత్త బాధ్యత దక్కింది. తెలుగు సినిమా రంగం నుంచి ఆమెకు ఈ బోర్డులో ప్రాతినిధ్యం లభించడం ఆసక్తికరంగా మారింది.

మూడేళ్ల పాటు కొనసాగనున్న బోర్డు

సినిమాటోగ్రాఫ్ యాక్ట్, 1952లోని నిబంధనలు, 2024 సర్టిఫికేషన్ రూల్స్ ప్రకారం ఈ కొత్త బోర్డును కేంద్రం ఏర్పాటు చేసింది. మొత్తం 18 మంది సభ్యులతో ఉన్న ఈ కమిటీ పదవీకాలం మూడు సంవత్సరాలు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగనుంది.

By Avinash