Srikanth Odela’s Powerful Comments on Women’s Strength in The Paradise

D News : ‘దసరా’తో వెన్నెల పాత్రను బలంగా తీర్చిదిద్దిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. ‘ది ప్యారడైజ్’లోనూ మహిళా పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చారు. నానితో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మహిళల పాత్రలు, వారి మానసిక బలం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

‘ఆడవాళ్ల ఎక్స్‌ట్రీమ్ వేరు’

సమాజంలో మగవాళ్లు తీసుకునేంత తీవ్రమైన నిర్ణయాలు మహిళలు తీసుకోలేరనే అభిప్రాయం ఉందని.. కానీ తన పరిశీలన మాత్రం అందుకు భిన్నంగా ఉందని శ్రీకాంత్ ఓదెల అన్నారు. తాము ప్రేమించిన వారి కోసం మహిళలు ఒకసారి ఎక్స్‌ట్రీమ్ నిర్ణయం తీసుకుంటే.. దాన్ని ఏ మగాడూ తట్టుకోలేడని పేర్కొన్నారు.

తమపై జరిగే అవమానాలు, వ్యక్తిగత బాధలను మహిళలు చాలాసార్లు భరించగలరని.. కానీ తండ్రి, భర్త, సోదరుడు, కొడుకు వంటి తమకు సంబంధించిన వ్యక్తులను ఎవరైనా అవమానిస్తే మాత్రం తీవ్రంగా స్పందిస్తారని శ్రీకాంత్ వివరించారు.

‘ప్యారడైజ్’లో సుబ్బు పాత్ర

‘ది ప్యారడైజ్’లో సుబ్బు పాత్రకు సంబంధించిన భావోద్వేగాన్ని కూడా దర్శకుడు వివరించారు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో పాటు కెరీర్‌లోనూ విఫలమై తీవ్ర నిరాశలో ఉన్న అమ్మాయి పాత్రగా సుబ్బును చూపించినట్లు తెలిపారు.

అయితే తన తండ్రిని అవమానించిన ఘటన ఆమెను తిరిగి నిలబడేలా చేస్తుందని చెప్పారు. తన తండ్రిని అవమానించిన వ్యక్తితోనే ఆయనకు గౌరవం దక్కేలా చేస్తాననే పట్టుదల ఆ పాత్రలోని బలాన్ని చూపిస్తుందని వివరించారు.

“కొడుకు పుడితే పారిపోయేవాడేమో నాన్నా.. కానీ కూతురిగా నేను నిలిచి నీ బాకీలన్నీ తీర్చాను” అనే డైలాగ్ ద్వారా సుబ్బు పాత్రలోని ధైర్యాన్ని చూపించినట్లు శ్రీకాంత్ తెలిపారు.

మహిళల భావోద్వేగాలు, వారి నిర్ణయాల్లోని తీవ్రతను తన సినిమాల్లో చూపించాలనే ఆలోచనతోనే ఈ పాత్రలను డిజైన్ చేసినట్లు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

By Avinash