
D News: Jul 31: Flipkart Pay Later Services: భారత ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తమ వినియోగదారులకు కొనుగోళ్లను మరింత సులభతరం చేసేందుకు ‘ఫ్లిప్‌కార్ట్ పే లేటర్’ (Flipkart Pay Later) సేవలను అధికారికంగా ప్రారంభించింది. వినియోగదారులకు సులభమైన, సౌకర్యవంతమైన డిజిటల్ క్రెడిట్ సదుపాయాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ PayU Finance భాగస్వామ్యంతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ కొత్త సదుపాయం కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కాకుండా మైంత్రా (Myntra), ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ (Flipkart Minutes) ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో వినియోగదారులు ఒకే క్రెడిట్ సదుపాయాన్ని పలు ప్లాట్‌ఫామ్‌లలో ఉపయోగించుకునే అవకాశం లభించనుంది.
వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని Flipkart Pay Later Services కింద మూడు రకాల చెల్లింపు ఎంపికలను అందుబాటులోకి తీసుకొచ్చారు. Pay Later ఆప్షన్ ద్వారా కొనుగోలు చేసిన తర్వాత 30 రోజుల లోపు బిల్లు చెల్లించవచ్చు.
Pay in 3 సదుపాయం ద్వారా కొనుగోలు చేసిన మొత్తాన్ని మూడు సమాన విడతల్లో చెల్లించే అవకాశం ఉంటుంది. అలాగే EMI ఆప్షన్ ద్వారా 3 నుంచి 12 నెలల వరకు సులభ వాయిదాల్లో చెల్లించవచ్చు. ఈ సదుపాయం స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, ఫర్నీచర్‌తో పాటు ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లకూ వర్తిస్తుంది.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వాలెట్లు, ఈఎంఐ, క్యాష్ ఆన్ డెలివరీ వంటి పలు చెల్లింపు విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటికి Flipkart Pay Later కూడా చేరడంతో వినియోగదారులకు మరింత ఆర్థిక వెసులుబాటు లభించనుంది.
