D Educt: Aug 31: దేశవ్యాప్తంగా ప్రశాంతంగా నీట్‌ పీజీ-2026 పరీక్ష

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య దేశవ్యాప్తంగా నీట్‌ పీజీ-2026 పరీక్ష విజయవంతంగా నిర్వహించినట్లు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఎంఎస్‌) వెల్లడించింది. ఆగస్టు 30న 339 నగరాల్లోని 1,111 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా సుమారు 2.63 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

అయితే రాజస్థాన్‌లోని జైపుర్‌ సీతాపురా ప్రాంతంలో రెండు పరీక్షా కేంద్రాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడ 2,445 మంది అభ్యర్థులు పరీక్షను పూర్తి చేయలేకపోయారు. ఈ అభ్యర్థుల కోసం సెప్టెంబర్‌ 5న జైపుర్‌లో ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌బీఎంఎస్‌ తెలిపింది.

ఏపీలో 18,765 మంది అభ్యర్థుల హాజరు

ఆంధ్రప్రదేశ్‌లో నీట్‌ పీజీ-2026 పరీక్షకు మొత్తం 19,266 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో 18,765 మంది పరీక్షకు హాజరయ్యారు. అంటే రాష్ట్రంలో 97.40 శాతం మంది పరీక్ష రాశారు. 22 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 77 పరీక్షా కేంద్రాల్లో ఒకే షిఫ్ట్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో పరీక్ష నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు నోడల్‌ అధికారులు, ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ సాయి సుధీర్‌, డీఐజీ ఫకీరప్ప తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని వెల్లడించారు.

మధ్యస్థం నుంచి కఠినంగా ప్రశ్నపత్రం

నీట్‌ పీజీ-2026 ప్రశ్నపత్రం మధ్యస్థం నుంచి కఠినంగా ఉందని పలువురు అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. మొత్తం 180 ప్రశ్నలు ఉండగా, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఎంచుకోవడం కష్టంగా అనిపించిందని తెలిపారు. ముఖ్యంగా కొన్ని ప్రశ్నల్లో ఇచ్చిన ఆప్షన్లను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని అభ్యర్థులు పేర్కొన్నారు.