
పూజలు చేస్తే కుటుంబంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మించిన మోసగాళ్లు ఓ మహిళను నిలువునా ముంచేశారు. దోషాల పేరుతో మాయమాటలు చెప్పి ఆమె నుంచి బంగారు ఆభరణాలు, నగదును దోచుకుని పరారయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది.
మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. కుటుంబంలో దోషాలు ఉన్నాయని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తే సమస్యలన్నీ తొలగిపోయి మంచి రోజులు వస్తాయని నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. పూజల పేరుతో ఓ మహిళ నుంచి 9 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.45 వేల నగదును దోచుకెళ్లారు.
వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని ఉజలంపాడ్ గ్రామానికి బుధవారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. భిక్షాటన చేసుకుంటూ గ్రామంలో తిరిగిన వారు.. తాము పూజలు నిర్వహించే బాబాలమంటూ స్థానికులకు పరిచయం చేసుకున్నారు. ఈ క్రమంలో యాదవరావు ఇంటికి వెళ్లి ఆయన భార్యతో మాటలు కలిపారు.
ఆమె కుటుంబంలో ఏదో దోషం ఉందని, అందుకే ఇంట్లో వరుసగా సమస్యలు ఎదురవుతున్నాయని నమ్మించారు. తమతో ప్రత్యేక పూజలు చేయించుకుంటే అన్ని కష్టాలు తొలగిపోతాయని, కుటుంబానికి మంచి జరుగుతుందని ఆశ చూపించారు. వారి మాటలను నిజమని నమ్మిన మహిళ పూజలు నిర్వహించేందుకు అంగీకరించింది.
అయితే పూజా కార్యక్రమానికి బంగారు ఆభరణాలు, నగదు అవసరమని నిందితులు చెప్పారు. దీంతో వారి మాటలు నమ్మిన బాధితురాలు తన వద్ద ఉన్న 9 గ్రాముల బంగారు నగలు, రూ.45 వేల నగదును వారికి అప్పగించింది. ఇదే అదనుగా భావించిన మోసగాళ్లు ఆమె దృష్టి మరల్చి విలువైన వస్తువులతో అక్కడి నుంచి జారుకున్నారు.
కొంతసేపటి తర్వాత జరిగిన మోసాన్ని గుర్తించిన మహిళ తీవ్ర ఆందోళనకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసింది. బాధితురాలి భర్త యాదవరావు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామానికి వచ్చిన అనుమానితుల వివరాలను సేకరిస్తూ, వారు ఏ మార్గంలో వెళ్లారనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.
ప్రజలకు పోలీసుల హెచ్చరిక
దోషాలు తొలగిస్తామని, ప్రత్యేక పూజలతో అదృష్టం మారుస్తామని చెప్పే అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. పూజలు, పరిహారాల పేరుతో ఎవరైనా బంగారం లేదా నగదు అడిగితే వెంటనే అప్రమత్తం కావాలని హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు. మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ ఇలాంటి మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
