
D NEWS: రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఎంవో అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆస్పత్రుల నిర్మాణాలు, సిబ్బంది నియామకాలు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల పనులపై సీఎం ఆరా తీశారు. ఎల్బీనగర్, అల్వాల్ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఆస్పత్రుల పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. వరంగల్, ఉస్మానియా ఆస్పత్రుల నిర్మాణాలను కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
కొత్త ఆస్పత్రుల నిర్మాణాలు పూర్తయ్యేలోపే అవసరమైన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నియామక ప్రక్రియను ముందుగానే ప్రారంభించాలని సీఎం సూచించారు. ఆస్పత్రులకు అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్లు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లు, ఆస్పత్రులను స్వయంగా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల విషయంలో వైద్య శాఖ అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వైద్య, విద్యా రంగాల సమీక్షతో పాటు డిసెంబర్లో ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపైనా సీఎం సమీక్షించారు. సమ్మిట్ కోసం పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేసి ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
