
D NEWS: మద్నూర్ మండలం పెద్ద తడ్గూర్ గ్రామంలో వర్షాభావం, విద్యుత్ సరఫరా సమస్యలతో పంటలు ఎండిపోతున్నాయని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. ఎండిపోయిన పత్తి, సోయా పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడిన ఆయన ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో బోర్లలో నీరు తగ్గిపోయిందని రైతులు తెలిపారు. మరోవైపు అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా లేక పంటలకు నీరు అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
పత్తి, సోయా పంటలు ఎండిపోవడంతో పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతులు హన్మంత్ షిండే దృష్టికి తీసుకెళ్లారు. వర్షాభావం, విద్యుత్ కొరత కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు.
ప్రభుత్వం వెంటనే క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయాలని హన్మంత్ షిండే కోరారు. నష్టపోయిన అర్హులైన రైతులందరికీ తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విజయ్, కృష్ణ పటేల్, మారుతి తదితరులు పాల్గొన్నారు. రైతుల పరిస్థితిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని హన్మంత్ షిండే కోరారు.
