
D NEWS: అనంతగిరి ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును ఆదేశించారు.
ఉదయం 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కేసారం నుంచి చింతకుంటకు ఓ వ్యక్తి అంత్యక్రియల కోసం బంధువులు బస్సులో వెళ్తుండగా ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఘాట్ రోడ్డుపై వెళ్తుండగా బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి పల్టీలు కొట్టినట్లు పోలీసులు తెలిపారు. బస్సు కుడివైపు పడిపోవడంతో ఆ వైపు కూర్చున్న ప్రయాణికుల్లో ఎక్కువ మంది గాయపడినట్లు వెల్లడించారు.
ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో 20 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద ఘటనపై అధికారులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం అందించడంతో పాటు బాధిత కుటుంబాలకు అండగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
