D-News: ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) దాఖలులో భారత్‌ కొత్త రికార్డు నమోదు చేసింది. 2026 ఆగస్టు 31 నాటికి అసెస్‌మెంట్‌ ఇయర్‌ (AY) 2026–27 కోసం 7.8 కోట్లకు పైగా ITRలు దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. ఆగస్టు 31 గడువు ఆడిట్‌ అవసరం లేని వ్యాపార, వృత్తిపరమైన పన్ను చెల్లింపుదారులకు వర్తించింది. సకాలంలో రిటర్నులు దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులు, పన్ను నిపుణులకు ఆదాయపు పన్ను శాఖ కృతజ్ఞతలు తెలిపింది.

వేర్వేరు వర్గాలకు వేర్వేరు గడువులు

2026 ఆర్థిక చట్ట సవరణల ప్రకారం ITR దాఖలు గడువుల్లో మార్పులు చేశారు. సాధారణంగా ఆడిట్‌ అవసరం లేని ఇతర పన్ను చెల్లింపుదారులకు గడువు జూలై 31 కాగా, ఆడిట్‌ అవసరం లేని వ్యాపార, వృత్తిపరమైన పన్ను చెల్లింపుదారులకు ఆగస్టు 31 వరకు అవకాశం ఇచ్చారు. కంపెనీలు, ఖాతాలను ఆడిట్‌ చేయించాల్సిన పన్ను చెల్లింపుదారులకు అక్టోబర్‌ 31 వరకు, సెక్షన్‌ 92E కింద ట్రాన్స్‌ఫర్‌ ప్రైసింగ్‌ నిబంధనలు వర్తించే వారికి నవంబర్‌ 30 వరకు గడువు ఉంది.

గడువు మిస్‌ అయితే?

గడువులోపు ITR దాఖలు చేయలేని వారు డిసెంబర్‌ 31, 2026 వరకు బిలేటెడ్‌ రిటర్న్‌ దాఖలు చేయవచ్చు. అయితే ఆలస్యంగా దాఖలు చేస్తే, మొత్తం ఆదాయం రూ.5 లక్షలకు మించకపోతే రూ.1,000, అంతకంటే ఎక్కువైతే రూ.5,000 వరకు ఆలస్య రుసుము వర్తిస్తుంది.

AY 2026–27 అనేది 2025–26 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్‌ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు) సంపాదించిన ఆదాయానికి సంబంధించినది. ITR దాఖలు చేసిన తర్వాత దాన్ని తప్పనిసరిగా ధృవీకరించాలి. ఇందుకు ఈ-వెరిఫికేషన్‌ లేదా ITR-V సమర్పణకు 30 రోజుల సమయం ఉంటుంది.