మాస్ మహారాజా రవితేజ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ విడుదలకు సిద్ధమవుతుండగానే.. మరో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో కలిసి రవితేజ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి మైత్రీ మూవీ మేకర్స్ తప్పుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

మైత్రీ సంస్థ ప్రాజెక్ట్ నుంచి వైదొలగడంతో.. ఇప్పుడు మరో నిర్మాత ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. నిర్మాత దిల్ రాజు నేతృత్వంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి గతంలో విడిపోయిన లక్ష్మణ్ ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు చేపట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. నిర్మాణ సంస్థ మార్పుపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇక మరోవైపు దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. రవితేజ మాస్ ఇమేజ్‌కు సరిపోయేలా ఈ కథను పవర్‌ఫుల్, స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్నట్లు టాక్.

వివేక్ ఆత్రేయ ప్రత్యేకమైన టేకింగ్‌కు రవితేజ మాస్ ఎనర్జీ జతకావడంతో ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని రవితేజ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.