
D News: భారతరత్న, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత కథ ఇప్పుడు వెండితెరపైకి రాబోతోంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ బయోపిక్‌లో రష్మిక మందన్న టైటిల్ రోల్లో నటించనున్నారు. ‘MS – A Legacy On Screen’ అనే పేరును ఖరారు చేసిన మేకర్స్.. చెన్నైలో సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 110వ జయంతిని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమానికి కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు.
రష్మికకు ప్రతిష్ఠాత్మక పాత్ర
ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేశ్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితాన్ని తెరపై ఆవిష్కరించే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.
సినిమా ప్రారంభోత్సవంలో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ.. ఎంఎస్ సుబ్బులక్ష్మి కేవలం గొప్ప గాయని మాత్రమే కాదని, ఎంతో అసాధారణమైన జీవితాన్ని గడిపారని చెప్పారు. ఆమె క్రమశిక్షణ, సహనం, సంగీతంపై ఉన్న అంకితభావాన్ని ఈ తరం ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో సినిమాను రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఇక తనకు ఈ పాత్ర దక్కడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని రష్మిక చెప్పింది. ఎంఎస్ అమ్మ జీవిత ప్రయాణంలో చిన్న భాగంగా మారే అవకాశం రావడం తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొంది. ఈ పాత్రను ప్రేక్షకులకు నచ్చేలా పోషించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపింది.

రష్మికపై కమల్ హాసన్ ప్రశంసలు
కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఎంఎస్ సుబ్బులక్ష్మి ఏ భాషలో పాట పాడినా ఆ భాషకే మరింత అందం వచ్చేదని గుర్తుచేశారు. ఆమె సంగీతం ప్రజలను కలిపే శక్తిగా నిలిచిందని పేర్కొన్నారు.ఇంత గొప్ప వ్యక్తి పాత్రను పోషించే అవకాశం రష్మికకు రావడం పెద్ద బాధ్యత అని కమల్ హాసన్ అన్నారు. తాను ఆ పాత్రను పోషించినా ఆమె స్థాయిలో మెప్పించలేనని చమత్కరించారు.
నాలుగు దక్షిణాది భాషల్లో విడుదల
నిర్మాతలు మాట్లాడుతూ ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితంపై ఎన్నో సంవత్సరాలుగా పరిశోధన చేసినట్లు తెలిపారు. ఆమె సంగీతాన్ని యథాతథంగా రీక్రియేట్ చేయడం కంటే.. ఆమె జీవితంలోని ముఖ్యమైన కోణాలను సినిమాటిక్‌గా చూపించడంపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారు.
ఈ చిత్రాన్ని నాలుగు దక్షిణ భారత భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిన ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితాన్ని రష్మిక ఎలా ఆవిష్కరించనుందనే ఆసక్తి ఇప్పుడు నెలకొంది.
