
D News: ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘స్పిరిట్’ ఒకటి. ‘యానిమల్’తో సంచలన విజయం అందుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. దీంతో ఈ సినిమా కథ, ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే దానిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే ‘స్పిరిట్’ షూటింగ్ గణనీయంగా పూర్తయిందని సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు. అయితే ఇప్పటివరకు చిత్రీకరించిన సన్నివేశాల్లో ప్రభాస్ పోలీస్ యూనిఫామ్‌లో కనిపించలేదనే ప్రచారం ఇప్పుడు కొత్త చర్చకు తెరతీసింది. దీంతో సినిమాలో ప్రభాస్ అండర్‌కవర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.
మహేశ్ బాబు ‘పోకిరి’ సినిమాలో అండర్‌కవర్ పోలీస్‌గా కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘స్పిరిట్’లోనూ ప్రభాస్ అదే తరహాలో మిషన్ కోసం తన అసలు గుర్తింపును దాచుకునే పోలీస్ పాత్రలో కనిపిస్తారా? అనే ఆసక్తి నెలకొంది. అయితే ఇది ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం మాత్రమే. చిత్రబృందం నుంచి దీనిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు.
ఒకవేళ ఈ టాక్ నిజమైతే.. సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో అండర్‌కవర్ ఆపరేషన్స్, డార్క్ యాక్షన్, వైలెన్స్‌ను మిక్స్ చేసి ప్రభాస్‌ను సరికొత్త అవతారంలో చూపించే అవకాశం ఉంది. అదే జరిగితే సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం.ఈ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్‌లో ప్రభాస్‌కు జోడీగా తృప్తి డిమ్రి నటిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలోని ‘ఫౌజీ’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మరోవైపు ‘స్పిరిట్’ కోసం కూడా తన డేట్స్‌ను కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాను 2027 మార్చిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ప్రభాస్ కటౌట్‌కు సందీప్ రెడ్డి వంగా మార్క్ టేకింగ్, యాక్షన్, ఎమోషన్ కలిస్తే ‘స్పిరిట్’ ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అండర్‌కవర్ కాప్ టాక్ నిజమవుతుందా? లేక దర్శకుడు మరో సర్ప్రైజ్ దాచారా? అనేది అధికారిక గ్లింప్స్ వస్తేనే స్పష్టమవుతుంది.
