
D Educt: Sept 22: పాలిటెక్నిక్ విద్య గతంలో మాదిరిగానే రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగనుంది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు ఆధ్వర్యంలోని కమిటీ సోమవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు తన నివేదికను సమర్పించింది. పాలిటెక్నిక్ విద్యలో పలు సంస్కరణలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఇంతకుముందు ప్రభుత్వం జూలై 3న జీఓ 97ను జారీ చేస్తూ పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి శాఖ పరిధిలోని స్కిల్స్ వర్సిటీకి అనుబంధంగా పనిచేసేలా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు, ఉద్యోగులకు నష్టం జరుగుతుందని, పాలిటెక్నిక్ విద్య మనుగడకు ఇబ్బందులు ఎదురవుతాయని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పాలిటెక్నిక్ కళాశాలలను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగుల ఐకాసలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు ఛైర్మన్గా ఆగస్టు 24న ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ వివిధ వర్గాల ప్రతినిధులతో పాటు జాక్ నేతలతోనూ చర్చలు నిర్వహించింది. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదికను అందజేసింది.
గతంలో మాదిరిగానే పాలిటెక్నిక్ కళాశాలల అనుబంధ గుర్తింపు, పరీక్షల నిర్వహణను ఎస్బీటెట్ ద్వారానే కొనసాగించాలని కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. స్కిల్స్ వర్సిటీకి అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) అనుమతులు లేవని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్స్ వర్సిటీ పరిధిలోకి తీసుకురావడంపై అధ్యాపకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయాన్ని కూడా నివేదికలో ప్రస్తావించింది.
భవిష్యత్తులో పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్స్ వర్సిటీకి అనుబంధంగా చేర్చాలని ప్రభుత్వం భావించినా, సంబంధిత కళాశాలల భాగస్వాములతో ముందుగా చర్చించాలని కమిటీ సూచించింది. అలాగే ఏదైనా ఒప్పందం కుదుర్చుకునే సమయంలో ఆయా కళాశాలల భాగస్వాముల అంగీకారాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని సిఫార్సు చేసింది.
కమిటీ నివేదికపై తెలంగాణ పాలిటెక్నిక్ ఐకాస ఛైర్మన్ నాగరాజు హర్షం వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యను సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించేలా సిఫార్సులు చేసినందుకు ప్రభుత్వానికి, కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
