D Educt: Nov 2: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశం: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 5వ తేదీన పేరెంట్స్ మీటింగ్ నిర్వహించనున్నారు. విద్యార్థుల విద్యా ప్రగతిని తల్లిదండ్రులకు వివరించడంతో పాటు, వారి అభ్యసన సామర్థ్యాలను అంచనా వేయడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా ఇటీవల నిర్వహించిన సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 (SA-1) పరీక్షల ఫలితాలను తల్లిదండ్రులతో పంచుకోనున్నారు.

విద్యార్థులు ఏయే సబ్జెక్టుల్లో మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు? ఏయే అంశాల్లో వెనుకబడి ఉన్నారు? వారి అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయి? అనే విషయాలపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో చర్చించనున్నారు. విద్యార్థుల చదువుపై పాఠశాలల్లోనే కాకుండా ఇంటి వద్ద కూడా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపేలా అవగాహన కల్పించనున్నారు.

విద్యార్థులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు

ఈ నెల 5వ తేదీన నిర్వహించే పేరెంట్స్ మీటింగ్ రోజునే విద్యార్థులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ జిల్లా విద్యాశాఖ అధికారులను (DEO) ఆదేశించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించింది. మరోవైపు, SA-1 పరీక్షలకు సంబంధించిన మార్కులను ఈ నెల 5వ తేదీలోపు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులు (HM), ఉపాధ్యాయులను ఆదేశించింది.

హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల ద్వారా విద్యార్థుల విద్యా ఫలితాలతో పాటు వారి సమగ్ర అభివృద్ధి, వివిధ నైపుణ్యాలు, అభ్యసన సామర్థ్యాలను తల్లిదండ్రులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా విద్యార్థుల బలాలు, మెరుగుపరచుకోవాల్సిన అంశాలను గుర్తించి, వారి అభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి కృషి చేసేందుకు ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *