Oscars 2027: Marathi Film ‘Gondhal’ Selected as India’s Official Entry!

D News: ఆస్కార్‌-2027కు భారత్ తరపున అధికారిక ఎంట్రీగా మరాఠీ చిత్రం ‘గోంధల్’ ఎంపికైంది. 99వ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఈ సినిమా భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఆస్కార్ ఎంట్రీ కోసం దేశవ్యాప్తంగా మొత్తం 33 సినిమాలు పోటీ పడగా.. వాటిలో ‘గోంధల్’ను ఎంపిక చేశారు. సంతోష్ దావఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మహారాష్ట్ర సంప్రదాయ ‘గోంధల్’ ఆచారం, జానపద సంస్కృతి నేపథ్యంలో రూపొందిన థ్రిల్లర్‌గా తెరకెక్కింది.

ఇప్పటికే ఈ సినిమా 2025లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శితమై, దర్శకుడు సంతోష్ దావఖర్‌కు ఉత్తమ దర్శకుడిగా సిల్వర్ పీకాక్ అవార్డును అందించింది.

గతేడాది నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హోమ్‌బౌండ్’ భారత్ తరపున ఆస్కార్‌కు ఎంపికైంది. అయితే ఈ చిత్రం తుది నామినేషన్స్‌లో చోటు దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు ‘గోంధల్’ ఆస్కార్ నామినేషన్ సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

By Avinash