
D Educt: Nov 10: దేశవ్యాప్తంగా ఆన్లైన్, పెన్ను-పేపర్ విధానాల్లో వివిధ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల సంఖ్యను విస్తరించాలని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) నిర్ణయించింది. ఈ మేరకు తగిన మౌలిక సదుపాయాలు కలిగిన విశ్వవిద్యాలయాలు, జాతీయ విద్యాసంస్థలు, కళాశాలలు, పాఠశాలలు పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆసక్తి కలిగిన విద్యాసంస్థలు డిసెంబరు 6వ తేదీ వరకు ఎన్టీఏ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఆఫ్‌లైన్ పరీక్ష కేంద్రం ఏర్పాటుకు కనీసం 250 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు వీలైన మౌలిక సదుపాయాలు ఉండాలని, ఆన్లైన్ పరీక్ష కేంద్రంలో ఒక్కో షిఫ్ట్‌కు 285 మంది పరీక్ష రాసేలా అవసరమైన కంప్యూటర్లు అందుబాటులో ఉండాలని నిబంధనలు విధించింది.
గతంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించిన ఎన్టీఏ, ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసింది. అయితే, ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ముఖ్యంగా నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా కంప్యూటర్లు, ఇతర సాంకేతిక సదుపాయాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఉదాహరణకు తెలంగాణలో మొత్తం 149 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా, వాటిలో 34 కళాశాలలు యూజీసీ స్వయం ప్రతిపత్తి హోదా పొందాయి. మరో 97 కళాశాలలకు న్యాక్ గుర్తింపు ఉంది. అయినప్పటికీ, బేగంపేట మహిళా కళాశాలలో మాత్రమే ఆన్లైన్ పరీక్ష కేంద్రం ఏర్పాటుకు అవసరమైన సదుపాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. పలు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో, విద్యాసంస్థల యాజమాన్యంతో సంబంధం లేకుండా నిర్దేశిత సౌకర్యాలు ఉన్న సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానించడం గమనార్హం.
అలాగే, వివిధ ఆన్లైన్, ఆఫ్‌లైన్ పరీక్షల్లో పరిశీలకులుగా పనిచేయడానికి అర్హత కలిగిన అభ్యర్థులు కూడా డిసెంబరు 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఏ సూచించింది. మరిన్ని వివరాల కోసం ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.
