D News: Jul 31: తెలంగాణ డ్రైవింగ్ లైసెన్స్: తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రవాణా శాఖ కొత్త నిబంధనను అమలు చేయనుంది. లెర్నర్ లైసెన్స్ పొందిన ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా రోడ్ సేఫ్టీ కోర్సు పూర్తి చేయాలని అధికారులు ప్రకటించారు. ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికే శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) పరీక్షకు హాజరయ్యే అర్హత లభిస్తుంది. సుప్రీం కోర్టు రోడ్ సేఫ్టీ కమిటీ ఆదేశాల మేరకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు రవాణా శాఖ తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్లలో రోడ్డు భద్రతపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కూకట్‌పల్లి ఆర్టీవో పరిధిలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయగా మంచి ఫలితాలు రావడంతో త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ కోర్సులో ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతకు సంబంధించిన వీడియోలు, శిక్షణా అంశాలు అందుబాటులో ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఈ ఉచిత కోర్సును అందిస్తున్నారు. ల్యాప్‌టాప్ లేదా కెమెరా ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా ఇంటి నుంచే ఈ శిక్షణను పూర్తి చేసే అవకాశం కల్పించారు.

కోర్సు ప్రారంభానికి ముందు ఫేస్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అనంతరం వాహనం స్టార్ట్ చేసే విధానం, సీట్ బెల్ట్ ధరించడం, మిర్రర్లు సరిచేయడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వంటి అంశాలపై వీడియోలు వీక్షించాలి. ప్రతి మాడ్యూల్ పూర్తయ్యాక చిన్న క్విజ్ ఉంటుంది. అన్ని మాడ్యూల్స్ పూర్తి చేసిన తర్వాత తుది పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికేట్ జారీ చేస్తారు.

మానవ తప్పిదాల కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ఈ కోర్సు ప్రధాన ఉద్దేశమని రవాణా శాఖ వెల్లడించింది. రవాణా కమిషనర్ ఇలంబర్తి విదేశీ విధానాలను అధ్యయనం చేసి ఈ పాఠ్యాంశాలను రూపొందించగా, దీనికి యునిసెఫ్ సంస్థ 60 శాతం నిధులు సమకూర్చింది. మైనర్లు వాహనాలు నడపకుండా నిరోధించడం, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచడం, కొత్త డ్రైవర్లలో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాటు పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ఈ కొత్త నిబంధనలను తెలుసుకుని సంబంధిత ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana