
D Educt: Aug 13: తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో MBBS, BDS కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-29 బ్లాక్ పీరియడ్‌కు సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్ కోర్సుల ఫీజులను ఖరారు చేస్తూ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.98 ప్రకారం.. 2023-26 బ్లాక్ పీరియడ్‌లో జీవో నం.106, 132 ద్వారా నిర్ణయించిన ఫీజులనే 2026-29 కాలానికి కూడా కొనసాగించనున్నారు.
తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో MBBS కోర్సుకు కన్వీనర్ కోటా (కేటగిరీ-ఏ) కింద ఏడాదికి రూ.60,000 ఫీజుగా నిర్ణయించారు. ఇక మేనేజ్మెంట్ కోటా (కేటగిరీ-బి)లో కాలేజీని బట్టి ఫీజులు మారనున్నాయి. ఏడాదికి కనిష్ఠంగా రూ.11.55 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.13 లక్షల వరకు ఫీజు ఉంటుంది.
ఏడాదికి రూ.13 లక్షల ఫీజు ఉన్న కాలేజీల్లో అపోలో మెడికల్ కాలేజ్, చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నార్కట్‌పల్లి), కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (హైదరాబాద్), మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి.
ఏడాదికి రూ.12.50 లక్షల ఫీజు ఉన్న కాలేజీల్లో ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్, దక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నాయి. రూ.12 లక్షల వార్షిక ఫీజు ఉన్న కాలేజీల్లో ఆయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, వీఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఖమ్మం), మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (బాచుపల్లి), మల్లారెడ్డి ఉమెన్స్ మెడికల్ కాలేజ్, మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆర్వీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, షాదన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నాయి.
మిగిలిన ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా (బీ కేటగిరీ) కింద ఏడాదికి రూ.11.55 లక్షల ఫీజు వసూలు చేయనున్నారు. NRI కోటా (కేటగిరీ-సి) కింద మేనేజ్మెంట్ కోటా ఫీజుకు గరిష్ఠంగా రెండు రెట్ల వరకు ఫీజు వసూలు చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో ఆయా కాలేజీల్లో సీ కేటగిరీ ఫీజు సంబంధిత బీ కేటగిరీ ఫీజుపై ఆధారపడి ఉంటుంది.
ప్రైవేట్ డెంటల్ కాలేజీల్లో BDS కోర్సుకు కన్వీనర్ కోటా (కేటగిరీ-ఏ) కింద ఏడాదికి రూ.45,000 ఫీజుగా నిర్ణయించారు. మేనేజ్మెంట్ కోటా (కేటగిరీ-బి) కింద కాలేజీని బట్టి ఏడాదికి రూ.4.20 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఫీజు ఉంటుంది.
2026-29 బ్లాక్ పీరియడ్‌లో ప్రభుత్వం కొత్తగా ఏదైనా మెడికల్ లేదా డెంటల్ కాలేజీకి అనుమతి ఇస్తే, ఆ కాలేజీకి అప్పటికే అమల్లో ఉన్న కనిష్ఠ ఫీజును మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. కొత్త కాలేజీలకు అధిక ఫీజులు నిర్ణయించి విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపకుండా ప్రభుత్వం ఈ నిబంధనను విధించింది.
ఫీజుల విషయంలో ప్రభుత్వం కాలేజీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు అదనంగా క్యాపిటేషన్ ఫీజు లేదా డొనేషన్ పేరుతో ఎలాంటి మొత్తాన్ని వసూలు చేయకూడదు. ఇలా అదనపు మొత్తాలు వసూలు చేయడం చట్టరీత్యా నేరమని ప్రభుత్వం హెచ్చరించింది.
అలాగే మొత్తం కోర్సు ఫీజును ఐదు వాయిదాల్లో, ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో వసూలు చేయాలని సూచించింది. ఒకసారి విద్యార్థి కాలేజీలో ప్రవేశం పొందిన తర్వాత కోర్సు పూర్తయ్యే వరకు అదే ఫీజు కొనసాగాలి. మధ్యలో ఫీజును పెంచేందుకు కాలేజీలకు అనుమతి ఉండదు.
తెలంగాణలో ప్రస్తుతం 27 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీలతో పాటు సికింద్రాబాద్‌లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లోనూ ఈ ఫీజు నిబంధనలు అమల్లో ఉంటాయి.
మొత్తంగా 2026-29 బ్లాక్ పీరియడ్‌లో పాత ఫీజులనే కొనసాగించాలన్న ప్రభుత్వ నిర్ణయం MBBS, BDSలో ప్రవేశాలు పొందే విద్యార్థులకు కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. ముఖ్యంగా కోర్సు మధ్యలో ఫీజులు పెంచకూడదనే నిబంధనతో విద్యార్థులు, తల్లిదండ్రులకు ముందుగానే ఆర్థిక ప్రణాళిక చేసుకునే అవకాశం లభించనుంది.
