మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యల విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రిపై చర్యల అంశం చర్చకు వచ్చింది.

ఈ వ్యవహారంపై పార్టీ నేతలు అధిష్ఠానానికి తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు సమాచారం. ఇద్దరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ముందుగా కొండా సురేఖతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇద్దరు మంత్రులు, ఓ సీనియర్‌ నేత కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.

మరోవైపు, సురేఖను కేబినెట్‌ నుంచి తొలగించకుండా ఆమె శాఖలను మార్చే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవడం కంటే, వివాదాన్ని పార్టీ అంతర్గతంగా పరిష్కరించడమే మంచిదని కొందరు నేతలు భావిస్తున్నట్లు సమాచారం.

సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తే కాంగ్రెస్‌ పార్టీకి రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉందని నేతలు అధిష్ఠానానికి సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ అంశంపై తొందరపడి నిర్ణయం తీసుకోకుండా, అన్ని కోణాలను పరిశీలించి జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.

మంత్రి కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పిస్తారా? ఆమెపై క్రమశిక్షణ చర్యలు తప్పవా? అనే చర్చ గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రిపై వేటు తప్పదనే ప్రచారం జరుగుతోంది.

దీనికి తోడు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తూ నివేదిక సమర్పించినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం కాంగ్రెస్‌ పార్టీలో మరింత చర్చనీయాంశంగా మారింది.

ఈ అంశంపైనే సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు, కీలక నేతలు ఢిల్లీలో కాంగ్రెస్‌ అధిష్ఠానంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మంత్రి వర్గం నుంచి తప్పించాలా? లేక మరో విధంగా సమస్యను పరిష్కరించాలా? అనే అంశాలపై అధిష్ఠానం అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

అయితే కొండా సురేఖపై చర్యల విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరించాలని పార్టీ అగ్రనేతలు సూచించినట్లు సమాచారం. సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించే అంశంపై ముందుగా ఆమెతో సంప్రదింపులు జరపాలని ఇద్దరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు సూచించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. గతంలో తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన ఓ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి.. సురేఖతో మాట్లాడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సూచించినట్లు తెలుస్తోంది. ఇటీవల బెంగళూరులో ఖర్గేతో సురేఖ సమావేశం కావడంలోనూ ఆ నేత కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.

మరో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కూడా సురేఖపై కఠిన చర్యలను వ్యతిరేకించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెను కేబినెట్‌ నుంచి తొలగిస్తే రాజకీయంగా ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని అధిష్ఠానానికి వివరించినట్లు తెలుస్తోంది. సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తే ఆమె రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లే అవకాశం ఉందని.. అదే జరిగితే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆ నేత అభిప్రాయపడినట్లు సమాచారం.

అయితే సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలను సమర్థించడం తమ ఉద్దేశం కాదని, ఆ వ్యాఖ్యలు పార్టీ నాయకుల దృష్టిలో ఖండించదగినవేనని అగ్రనేతలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనే అంశంలోనే సంప్రదింపులు అవసరమని వారు అభిప్రాయపడినట్లు సమాచారం.

ఇదే సమయంలో తెలంగాణ కేబినెట్‌కు చెందిన ఇద్దరు మంత్రులు కూడా మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. సుస్మిత పార్టీ సభ్యురాలు కాదని, ఆమె వ్యాఖ్యలపై చర్యలు అవసరమైనప్పటికీ.. సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించే అంశాన్ని వేరుగా చూడాలని వారు సూచించినట్లు సమాచారం. సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలను బహిరంగంగా ఖండించాల్సి ఉండేదన్న అభిప్రాయాన్ని కూడా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

మరోవైపు, సురేఖను పూర్తిగా కేబినెట్‌ నుంచి తొలగించకుండా ఆమె శాఖలను మార్చడం కూడా ప్రత్యామ్నాయంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. దీనివల్ల పార్టీ అసంతృప్తిని స్పష్టంగా తెలియజేయడంతో పాటు.. ఈ వ్యవహారం పెద్ద రాజకీయ ఘర్షణగా మారకుండా నియంత్రించవచ్చని కొందరు నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి కొనసాగిస్తూ శాఖలను మార్చడం కూడా ఒక రకమైన క్రమశిక్షణ చర్యగానే పరిగణించవచ్చని ఓ సీనియర్‌ నేత అభిప్రాయపడినట్లు సమాచారం.

సురేఖ పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవారు కాగా, ఆమె భర్త కొండా మురళి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఈ రెండు వర్గాలకు బీసీ సామాజిక వర్గాల్లో గణనీయమైన ప్రాతినిధ్యం ఉంది. తెలంగాణలో బీసీలను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. సురేఖ విషయంలో రాజకీయంగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు నేతలు అధిష్ఠానానికి సూచించినట్లు సమాచారం.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana