D News: పోరాటాల గడ్డ వరంగల్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మంత్రి పదవి నుంచి కొండా సురేఖ బర్తరఫ్ కావడం, జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ముదరడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ దంపతులు రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రెండు పార్టీల నేతలతో చర్చలు?

కొండా సురేఖ దంపతులు రెండు ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. తమకు తగిన రాజకీయ ప్రాధాన్యతతో పాటు రెండు కీలక అసెంబ్లీ స్థానాలు కేటాయించే పార్టీ వైపు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మంతనాలు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్‌ నేతల ఎదురుదాడి

కొండా సురేఖ పార్టీ మారే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో వరంగల్‌ కాంగ్రెస్‌ నేతలు ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే బసవరాజు సారయ్య, కుడా చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి మీడియా ముందుకు వచ్చి కొండా దంపతుల తీరును తప్పుబట్టారు.

సీఎం రేవంత్‌పై విమర్శలు చేయొద్దని హెచ్చరిక

మీడియా, సోషల్‌ మీడియాలో హైలైట్‌ అయ్యేందుకే కొండా కుటుంబం అర్థరహిత విమర్శలు చేస్తోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

వరంగల్‌ కాంగ్రెస్‌లో అయోమయం

ఒకవైపు సొంత పార్టీకి చెందిన నేతలు కొండా సురేఖపై బహిరంగంగా విమర్శలు చేస్తుండగా.. మరోవైపు కొండా దంపతులు ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాలపై దృష్టి పెట్టినట్లు వస్తున్న వార్తలు కాంగ్రెస్‌ శ్రేణుల్లో చర్చకు దారితీశాయి. తాజా పరిణామాలు ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తాయనేది ఆసక్తికరంగా మారింది.