
D News: తమిళ స్టార్ హీరో కార్తీ, దర్శకుడు పి.ఎస్. మిత్రన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సర్దార్’ మంచి విజయాన్ని అందుకోవడంతో దానికి సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఓవర్సీస్ నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో టాక్ రావడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రధానంగా ‘మిషన్’ చుట్టూనే కథను నడిపించే ప్రయత్నం చేశారు. పాటలు, అనవసరమైన కామెడీ ట్రాక్స్, దృష్టి మళ్లించే కమర్షియల్ అంశాలకు పెద్దగా చోటివ్వకుండా కథపైనే ఫోకస్ పెట్టడం ఒక మంచి విషయమే. కానీ ఆ కథను తెరపై చూపించిన విధానం మాత్రం తీవ్రంగా నిరాశపరిచిందనే టాక్ వస్తోంది.
ముఖ్యంగా లాజిక్‌కు అందని సన్నివేశాలు, హద్దులు దాటిన యాక్షన్ సినిమాకు మైనస్‌గా మారాయి. కొన్ని సీరియస్ సన్నివేశాల్లో యాక్షన్ మరీ అతిగా ఉండటంతో అసలు సన్నివేశం తీవ్రత తగ్గిపోయింది. కీలకమైన సందర్భాలు కూడా ప్రేక్షకులకు సిల్లీగా అనిపించే పరిస్థితి ఏర్పడిందని రివ్యూలు చెబుతున్నాయి.
కార్తీ పోషించిన సీనియర్ ‘సర్దార్’ పాత్ర చుట్టూ వచ్చే ముఖ్యమైన సన్నివేశాలపైనా అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే వాటిలో ఏ ఒక్కటీ అనుకున్న స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు విలన్‌గా నటించిన ఎస్.జే. సూర్య తన నటనతో మెప్పించడం కంటే ఎక్కువగా అరుపులు, గట్టిగా మాట్లాడే సన్నివేశాలకే పరిమితమయ్యారనే విమర్శలు వస్తున్నాయి.
ఫస్టాఫ్‌లో పెద్దగా పండని డ్రామాను భరిస్తూ వెళ్లిన ప్రేక్షకులకు సెకండాఫ్‌లో అయినా బలమైన కథనం, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు కనిపిస్తాయని ఆశ కలుగుతుంది. కానీ సెకండాఫ్ కూడా అదే స్థాయిలో తేలిపోవడంతో సినిమాపై అంచనాలు మరింత తగ్గిపోయాయని ఓవర్సీస్ టాక్.
మొత్తంగా కథను నేరుగా చెప్పాలనే ప్రయత్నం కనిపించినప్పటికీ, కావాల్సిన థ్రిల్, ఎమోషన్, ఇంపాక్ట్‌ను అందించడంలో దర్శకుడు విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది. భారీ యాక్షన్‌తో సినిమాను నిలబెట్టాలనుకున్న ప్రయత్నం బెడిసికొట్టడంతో ‘సర్దార్ 2’ మిషన్ మొదలయ్యేలోపే తేలిపోయిందనే కామెంట్లు వస్తున్నాయి.
