Jr NTR: Raghavendra Rao’s ‘Gen Z NTR’ Comment Creates Fun at Fahadh Faasil’s Event

D News: జూనియర్ ఎన్టీఆర్, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మధ్య ఉన్న అనుబంధం మరోసారి ఓ సినిమా వేడుకలో కనిపించింది. ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చోటుచేసుకున్న ఓ సరదా ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎన్టీఆర్‌పై రాఘవేంద్రరావు చేసిన వ్యాఖ్యలు అక్కడ నవ్వులు పూయించగా.. తారక్ ఇచ్చిన రియాక్షన్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

‘జై ఎన్టీఆర్’ అంటూ అభిమానుల్లో జోష్

కార్యక్రమంలో మాట్లాడేందుకు వచ్చిన రాఘవేంద్రరావు.. ‘జై ఎన్టీఆర్’ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. దీంతో అక్కడున్న అభిమానులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. అయితే వెంటనే దర్శకేంద్రుడు ఆ నినాదానికి మరో అర్థం చెబుతూ సరదా పంచ్ వేశారు.

తాను చెప్పిన ‘జై ఎన్టీఆర్’ ప్రస్తుతం వేదికపై ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించింది కాదని.. సీనియర్ ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకుంటూ అన్న మాట అని వివరించారు. ఆ తర్వాత నందమూరి కుటుంబంలోని తరాల గురించి ప్రస్తావిస్తూ తనదైన శైలిలో మాట్లాడారు.

నందమూరి వారసత్వంపై ఫన్

సీనియర్ ఎన్టీఆర్ తర్వాత నందమూరి హరికృష్ణ, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అంటూ రాఘవేంద్రరావు పేర్కొన్నారు. చివర్లో ప్రస్తుత తరం తారక్‌ను ‘జెన్‌జీ ఎన్టీఆర్’ అంటూ సరదాగా సంబోధించారు. ఈ వ్యాఖ్యతో సభలో నవ్వులు వెల్లువెత్తాయి.

రాఘవేంద్రరావు మాటలు వింటున్న తారక్ కూడా చిరునవ్వుతో స్పందించారు. పక్కనే కూర్చున్న ఎస్.ఎస్. రాజమౌళి సైతం నవ్వుతూ కనిపించారు. ఈ మొత్తం సన్నివేశానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా రాఘవేంద్రరావు కామెంట్‌కు తారక్ ఇచ్చిన రియాక్షన్‌పై అభిమానులు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.

అక్టోబర్ 2న ఫహాద్ మూవీ

ఇక ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ విషయానికి వస్తే.. శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించారు. ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించారు.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ రావడంతో అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ మూవీ అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది.

By Avinash