
DNews: Dec 08: జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున సీనియర్ అడ్వకేట్ సాయి దీపక్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో ఈ-కామర్స్ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వస్తున్న కంటెంట్ ఆయన వ్యక్తిగత హక్కులను ఉల్లంఘిస్తోందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. జస్టిస్ మన్మీత్ పృతమ్ సింగ్ అరోరా ఈ పిటిషన్‌ను విచారించి, జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్‌ను ఐటీ రూల్స్–2021 ప్రకారం ఈ-కామర్స్ సంస్థలు, సోషల్ మీడియా కంపెనీలకు ఫిర్యాదుగా పరిగణించాలని ఆదేశించారు. మూడు రోజుల్లో చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తదుపరి విచారణను డిసెంబర్ 22కి వాయిదా వేశారు. గతంలో చిరంజీవి, నాగార్జున వంటి ప్రముఖ నటులు కూడా ఇలాంటి రక్షణ కోసం కోర్టును ఆశ్రయించారు. వారి ఫోటోలు, పేర్లు, వీడియోలను అనుమతి లేకుండా వాడరాదని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా తన వ్యక్తిగత హక్కులు వాణిజ్య విషయాల్లో కూడా ఉల్లంఘించబడకూడదని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
