
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ నియామకాల అంశాన్ని వైసీపీ రాజకీయ డ్రామాగా మార్చిందని విమర్శించారు. శనివారం పాలకొల్లు నియోజకవర్గంలో రూ.2 కోట్లతో చేపట్టనున్న రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
డీఎస్సీ నియామకాలను గతంలో వ్యతిరేకించిన వైసీపీ.. ఇప్పుడు నిరుద్యోగుల పేరుతో ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందని నిమ్మల ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల భవిష్యత్తును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఇలాంటి రాజకీయ డ్రామాలకు కూటమి ప్రభుత్వం తలొగ్గేది లేదని స్పష్టం చేశారు.
జగన్ ప్రభుత్వ హయాంలో టీచర్ రిక్రూట్మెంట్ను అడ్డుకునేందుకు 356 రిట్ పిటిషన్లు దాఖలు చేశారని మంత్రి ఆరోపించారు. ప్రస్తుతం డీఎస్సీ నియామకాలపై ప్రశ్నించే ముందు తమ ప్రభుత్వ హయాంలో టీచర్ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల విషయంలో రాజకీయాలు చేస్తున్న వైసీపీని అభ్యర్థులు నిలదీయాలని సూచించారు.
పదేళ్లుగా అభ్యర్థులు కష్టపడి, కోచింగ్ తీసుకుని పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించారని నిమ్మల పేర్కొన్నారు. ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించి నియామకాలు చేపడతామని హామీ ఇచ్చి జగన్ మాట తప్పారని విమర్శించారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధ్యక్ష పదవికి జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
