
India A vs Nepal Rising Stars Asia Cup 2026: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026లో భారత యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు ఏకంగా 306 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో తిలక్ వర్మ, కుమార్ కుశాగ్ర సెంచరీలతో చెలరేగగా.. బౌలింగ్‌లో ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రాణా ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించారు. భారత బౌలర్ల ధాటికి నేపాల్ జట్టు కేవలం 26 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో ఇండియా-ఏ లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో తన అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.
తిలక్ వర్మ, కుమార్ కుశాగ్ర సెంచరీల జోరు!
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నేపాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. అభిషేక్ శర్మ 9 పరుగులు, ఆయుష్ బదోని 2 పరుగులకే పెవిలియన్ చేరారు. మరోవైపు వైభవ్ సూర్యవంశీ 32 బంతుల్లో 26 పరుగులు చేసి ఔటయ్యాడు.
దీంతో భారత జట్టు 42 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ తిలక్ వర్మ, యువ వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుశాగ్ర బాధ్యత తీసుకున్నారు. అద్భుతమైన బ్యాటింగ్‌తో నేపాల్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.
నాలుగో వికెట్‌కు 206 పరుగుల భాగస్వామ్యం!
కష్టాల్లో ఉన్న భారత జట్టును ఈ ఇద్దరూ తమ అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. బౌండరీలు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. నాలుగో వికెట్‌కు ఏకంగా 206 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
కుమార్ కుశాగ్ర 102 బంతుల్లో 117 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు కెప్టెన్ తిలక్ వర్మ 113 బంతుల్లో 107 పరుగులు సాధించాడు. ఇందులో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
చివర్లో సూర్యాన్ష్ షెడ్గే కేవలం 14 బంతుల్లోనే 36 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. దీంతో ఇండియా-ఏ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 332 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ప్రిన్స్ యాదవ్ ఐదు వికెట్ల ప్రదర్శన!
333 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్‌కు భారత బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆరంభం నుంచే వరుసగా వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు.
ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్‌తో నేపాల్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఐదు ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు హర్షిత్ రాణా కూడా తన పేస్‌తో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాడు. ఆరు ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు సాధించాడు. షాబాజ్ అహ్మద్ మరో వికెట్ తీశాడు.
భారత బౌలర్ల ధాటికి నేపాల్ బ్యాటర్లలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. రషీద్ ఖాన్, పవన్ సరాఫ్ చెరో ఆరు పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు.
26 పరుగులకే నేపాల్ ఆలౌట్!
భారత బౌలర్ల దెబ్బకు నేపాల్ ఇన్నింగ్స్ కేవలం 11.3 ఓవర్లలోనే ముగిసింది. ఆ జట్టు 26 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇండియా-ఏ 306 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.
ఈ గెలుపుతో లిస్ట్-ఏ క్రికెట్లో ఇండియా-ఏ తన అత్యుత్తమ విజయాన్ని నమోదు చేసింది. అంతకుముందు 2018లో లీసెస్టర్‌షైర్‌పై 281 పరుగుల తేడాతో సాధించిన విజయం రికార్డుగా ఉండేది. ఇప్పుడు నేపాల్‌పై 306 పరుగుల విజయంతో ఆ రికార్డును అధిగమించింది.
లిస్ట్-ఏ చరిత్రలో నేపాల్‌కు చెత్త రికార్డు!
నేపాల్ జట్టు చేసిన 26 పరుగులు లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాయి. భారత బౌలర్ల ధాటికి అంతర్జాతీయ స్థాయి అనుభవం ఉన్న నేపాల్ బ్యాటర్లు కూడా నిలబడలేకపోయారు.
మొత్తానికి ఈ మ్యాచ్‌లో ఇండియా-ఏ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. బ్యాటింగ్‌లో తిలక్ వర్మ, కుమార్ కుశాగ్ర సెంచరీలతో అదరగొట్టగా.. బౌలింగ్‌లో ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రాణా వికెట్ల వర్షం కురిపించారు. ఈ భారీ విజయంతో రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత యువ జట్టు తమ టైటిల్ వేటను ఘనంగా ప్రారంభించింది.
