IND vs SL 1st ODI in Visakhapatnam on December 13, Rohit Sharma and Virat Kohli Set for Special Appearance

ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను మరోసారి ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించనుంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య డిసెంబర్ 13న జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌కు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. తొలుత ఈ మ్యాచ్‌ను ఢిల్లీలో నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, కొన్ని కారణాలతో వేదికను మార్చుతూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్, శ్రీలంక జట్ల మధ్య జరగనున్న వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ వేదిక మారినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 13న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను విశాఖపట్నంలోని ACA-VDCA క్రికెట్ స్టేడియానికి మార్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానుల్లో ఆనందం నెలకొంది.

ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో పాటు అరుణ్ జైట్లీ స్టేడియంలో ఔట్‌ఫీల్డ్ పునరుద్ధరణ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మ్యాచ్ నిర్వహణకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) భావించింది. ఈ మేరకు వేదికను మార్చాలని బీసీసీఐని కోరింది. DDCA విజ్ఞప్తిని పరిశీలించిన బీసీసీఐ.. మ్యాచ్‌ను విశాఖకు తరలిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ ప్రకటనతో విశాఖ క్రికెట్ అభిమానులకు పెద్ద పండగే అని చెప్పాలి. ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆటను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం రావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విశాఖలో రోహిత్, కోహ్లీలకు ఇదే చివరి మ్యాచ్ అవుతుందా?

ఈ మ్యాచ్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. విశాఖ వేదికగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరూ టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు.

2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడటమే లక్ష్యంగా ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. 2027 ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మెగా టోర్నీ తర్వాత రోహిత్, కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిస్థాయిలో వీడ్కోలు పలికే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.

అదే జరిగితే 2027 ప్రపంచకప్‌కు ముందు విశాఖలో జరిగే ఈ వన్డే మ్యాచ్‌లో రో-కో జోడీని చూసే అవకాశం అభిమానులకు ప్రత్యేకంగా మారుతుంది. అయితే ఈ మ్యాచ్ నిజంగానే విశాఖలో వీరిద్దరి చివరి మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. ఏదేమైనా డిసెంబర్ 13న జరగనున్న భారత్-శ్రీలంక తొలి వన్డేపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *