
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం ‘ఐ యామ్ గేమ్’ విడుదల రోజే తెలుగు ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. సాంకేతిక కారణాలతో తెలుగు వెర్షన్ ప్రదర్శనలు పలు థియేటర్లలో ఆలస్యమయ్యాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఫస్ట్ షోలు సమయానికి ప్రారంభం కాకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని దుల్కర్ అభిమానులు అసంతృప్తికి గురయ్యారు.
ఈ పరిణామంపై చిత్రబృందం వెంటనే స్పందించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలుగు డిజిటల్ కంటెంట్ డెలివరీ సమయంలో అనూహ్యంగా తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగానే షోలు ఆలస్యమయ్యాయని వెల్లడించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లకు మలయాళ వెర్షన్ కంటెంట్ ఇప్పటికే సజావుగా చేరిందని, దీంతో మలయాళ షోలు నిర్ణయించిన సమయానికే కొనసాగుతున్నాయని తెలిపింది.
తెలుగు షోలను కూడా వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు సాంకేతిక బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని నిర్మాతలు పేర్కొన్నారు. సమస్య పరిష్కారమైన వెంటనే తెలుగు ప్రదర్శనలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. టికెట్లు ముందుగానే బుక్ చేసుకుని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు కలిగిన అసౌకర్యానికి చిత్రబృందం క్షమాపణలు తెలిపింది.
ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్‌కు జోడీగా కయాదు లోహార్, సంయుక్త విశ్వనాథన్ నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల దుల్కర్ సల్మాన్, సంయుక్త విశ్వనాథన్ హైదరాబాద్‌కు వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి నెలకొంది.
అయితే విడుదల రోజునే తెలుగు షోలు సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యం కావడం అభిమానులను కొంత నిరాశకు గురిచేసింది. సమస్య త్వరగా పరిష్కరించి షోలు ప్రారంభించాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
