Hyderabad Water Tankers Strike: Owners Protest Against HYDRAA, Thousands of Litres of Water Dumped on Roads

హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన బంద్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెవెన్యూ, హైడ్రా (HYDRAA) అధికారుల విధానాల వల్ల తమ వ్యాపారాలు, జీవనోపాధి దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ ట్యాంకర్ల యజమానులు ఆందోళనకు దిగారు. నగరవ్యాప్తంగా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను నిలిపివేయాలని పిలుపునిచ్చిన వారు.. బంద్‌ను పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతున్న ఇతర ట్యాంకర్లను అడ్డుకున్నారు. అంతేకాకుండా, కొన్ని ట్యాంకర్లలో ఉన్న వేల లీటర్ల మంచినీటిని రోడ్లపైనే పారబోసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

అక్రమ బోర్ల తొలగింపుపై ట్యాంకర్ల యజమానుల ఆగ్రహం

నగరంలోని చెరువులు, వాటి పరిసర ప్రాంతాలను పరిరక్షించేందుకు హైడ్రా అధికారులు కొంతకాలంగా చర్యలు చేపడుతున్నారు. చెరువుల సమీపంలో ఉన్న అక్రమ నిర్మాణాలతోపాటు అనుమతులు లేని బోర్లను కూడా తొలగిస్తున్నారు. అయితే ఈ చర్యలు తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేందుకు తాము ఏర్పాటు చేసుకున్న బోర్లను కూడా అధికారులు అక్రమమైనవిగా పేర్కొంటూ తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే బోర్లను తొలగించడం వల్ల తమ ఉపాధి ప్రశ్నార్థకంగా మారిందని వాపోతున్నారు.

సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్

ప్రభుత్వం, సంబంధిత అధికారులు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వందలాది కుటుంబాలు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ట్యాంకర్ల సంఘం ప్రతినిధులు పేర్కొంటున్నారు. తమ సమస్యలను అధికారులు వెంటనే పరిగణనలోకి తీసుకోవాలని, బోర్ల తొలగింపు విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని డిమాండ్ చేస్తున్నారు.

అధికారులు స్పందించి తమ సమస్యలకు పరిష్కారం చూపే వరకు నిరసన కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ట్యాంకర్ల బంద్‌తో నగరంలో నీటి సరఫరాపై ఎలాంటి ప్రభావం పడుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *