
D Spiritual: Nov 21: వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సవం
భక్తిశ్రద్ధలతో స్వామివారి ఎదుర్కోలు.. భారీగా తరలివచ్చిన భక్తజనం.. కల్యాణోత్సవం అనంతరం మహా అన్నదానం
ఖానాపూర్ టౌన్, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ 42వ వార్షికోత్సవాలు రెండు రోజులుగా వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సమీప గ్రామాలతోపాటు పట్టణంలోని పలు కాలనీల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కల్యాణ ఘట్టాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించారు.
కల్యాణోత్సవంలో భాగంగా అమ్మవార్ల పూస్తేలు, మట్టెలు, పట్టు వస్త్రాలను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. మహిళల కోలాటాలు, భక్తి పాటలు, భజనలతో తలంబ్రాలను ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి చేర్చారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ చక్రపాణి వాసుదేవ ఆచార్యులు, స్థానాచార్యులు శ్రీమాన్ నరసింహమూర్తి, అర్చకులు నిమ్మగడ్డ శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ స్వామివారి కల్యాణోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవస్థానం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న మహిళలు ఓడి బియ్యం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. వేలాదిమంది మహిళలు, భక్తులు హాజరై స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. అనంతరం భక్తులకు భారీ స్థాయిలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ అంకం మౌనిక దంపతులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, హిందూ ఉత్సవ సమితి నాయకులు, ఆలయ కమిటీ అధ్యక్షుడు అడ్డగట్ల రాజన్న, కార్యదర్శి నిమ్మల రమేష్, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
