D News: Nov 10: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వైద్య ఆరోగ్య శాఖలో 2,929 ఉద్యోగాల భర్తీకి కసరత్తు!

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మరోసారి మంచి అవకాశం అందుబాటులోకి రానుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న మొత్తం 2,929 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే వీటిలో 996 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మిగిలిన 1,933 పోస్టులకు సంబంధించి అనుమతులు రావాల్సి ఉంది. ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే నియామక ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

996 పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం

వైద్య ఆరోగ్య శాఖలో గుర్తించిన మొత్తం 2,929 ఖాళీల్లో 996 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఇప్పటికే అనుమతులు మంజూరు చేసింది. వీటిలో 198 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 308 ఆయుష్ ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు 290 టెక్నీషియన్ పోస్టులు, 14 బయోమెడికల్ ఇంజినీర్ పోస్టులు, 46 ఫిజియోథెరపిస్ట్ పోస్టులు, 11 రేడియోగ్రాఫర్ పోస్టులు, 73 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 54 ఏఎన్ఎం పోస్టులు ఉన్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, వైద్య విద్య సంచాలకుల కార్యాలయం, ఆయుష్, ఎంఎన్‌జే, ఐపీఎం తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

మరో 1,933 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు పెండింగ్

మిగిలిన 1,933 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రస్తుతం ఆర్థిక శాఖ అనుమతుల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. వీటిలో ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 134 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, వైద్య విద్య సంచాలకుల పరిధిలో 288 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఉన్నాయి. అలాగే 716 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 148 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 194 స్టాఫ్ నర్సులు, 96 ల్యాబ్ టెక్నీషియన్లు, 119 జూనియర్ అసిస్టెంట్లు, 238 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని ప్రతిపాదించారు.

ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చిన తర్వాత పోస్టుల వారీగా ఖాళీలను ఖరారు చేసి సంబంధిత నియామక సంస్థల ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఎక్కువ పోస్టుల భర్తీని మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామక ప్రక్రియను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ద్వారా నిర్వహించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే 2,711 పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగింపు

మరోవైపు వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే 2,711 పోస్టుల నియామక ప్రక్రియ వివిధ దశల్లో కొనసాగుతోంది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలోని 1,931 ఎంపీహెచ్‌ఏ (ఫీమేల్) పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపు పూర్తయింది. త్వరలోనే తుది ఎంపిక జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే ఫార్మసిస్ట్ గ్రేడ్-2కు సంబంధించిన 732 పోస్టుల నియామకాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రక్రియలో కొంత జాప్యం జరిగినట్లు తెలుస్తోంది.

డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఎంపికకు మరింత సమయం

ఇక 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఎంపిక ప్రక్రియకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ పోస్టుల కోసం 4 వేలకు పైగా దరఖాస్తులు రావడంతో అభ్యర్థుల వివరాల పరిశీలన, వెయిటేజీ మార్కుల లెక్కింపు ప్రక్రియకు సమయం పడుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఎంపిక జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.

నిరుద్యోగులకు మరో ఉద్యోగ అవకాశం

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా ప్రతిపాదించిన 2,929 పోస్టులతో పాటు ఇప్పటికే కొనసాగుతున్న నియామక ప్రక్రియ నిరుద్యోగులకు ఆశాజనకంగా మారింది. ముఖ్యంగా వైద్య, పారామెడికల్, నర్సింగ్, ఫార్మసీ విభాగాల్లో అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే అవకాశం లభించనుంది. అయితే కొత్త పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తుల తేదీలు అధికారిక నోటిఫికేషన్లు విడుదలైన తర్వాత స్పష్టమవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *