
D Educt: Nov 7: కరీంనగర్ అమ్మాయి అరుదైన ఘనత.. పార్లమెంట్లో తెలంగాణ కీర్తి చాటిన శ్రీనిత్య!
కరీంనగర్‌కు చెందిన విద్యార్థిని ఎం. శ్రీనిత్య జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది. ప్రతిష్టాత్మక వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2026 పోటీల్లో రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థినిగా నిలిచి తన ప్రతిభను చాటుకుంది. ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో లోక్‌సభ స్పీకర్, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖుల సమక్షంలో ఎలాంటి బెరుకు లేకుండా ప్రసంగించి అందరి ప్రశంసలు అందుకుంది. సాధారణ స్థాయి నుంచి జాతీయ వేదిక వరకు సాగిన ఆమె విజయ ప్రస్థానం ఇప్పుడు ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
కరీంనగర్‌లోని ఎస్సాఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న శ్రీనిత్య తన వాక్చాతుర్యం, ఆత్మవిశ్వాసంతో జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిభను చాటింది. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ పార్లమెంట్ పోటీల్లో అంచెలంచెలుగా రాణించింది. తొలుత రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైంది. దేశవ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులు పోటీపడిన ఈ కార్యక్రమంలో తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థినిగా ప్రత్యేక గుర్తింపు పొందింది.
పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆకట్టుకున్న ప్రసంగం
భారత తొలి ఉపప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 31న పార్లమెంట్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్, కేంద్ర మంత్రులు, విపక్ష నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారి సమక్షంలో శ్రీనిత్య ఎంతో ధైర్యంగా తన ప్రసంగాన్ని వినిపించింది. ‘‘దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత పాత్ర – వికసిత భారత్ దిశగా సరికొత్త ఆలోచనలు’’ అనే అంశంపై మాట్లాడింది. స్పష్టమైన విశ్లేషణ, ఆలోచనాత్మకమైన అభిప్రాయాలు, అద్భుతమైన వాక్చాతుర్యంతో సభికులను ఆకట్టుకుని ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.
యువతకు ఆదర్శంగా శ్రీనిత్య.. ప్రశంసల వెల్లువ
సాధారణ ప్రభుత్వ కళాశాలలో విద్యనభ్యసిస్తూ పార్లమెంట్ వంటి ప్రతిష్ఠాత్మక వేదికపై ప్రసంగించే స్థాయికి ఎదిగిన శ్రీనిత్య విజయం కరీంనగర్ జిల్లాకే కాకుండా యావత్ తెలంగాణ విద్యార్థి లోకానికి గర్వకారణంగా నిలిచింది. కృషి, పట్టుదల, నిరంతర సాధన ఉంటే ఎలాంటి ఉన్నత లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని ఆమె తన విజయంతో నిరూపించింది. ముఖ్యంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఆమె ప్రయాణం గొప్ప ప్రేరణగా నిలుస్తోంది.
శ్రీనిత్య సాధించిన ఈ అరుదైన విజయంపై కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఎస్సాఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ, అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందించారు. దేశ రాజధానిలో ప్రభుత్వ కళాశాల ప్రతిష్ఠను ఇనుమడింపజేసిన శ్రీనిత్య భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆమె సాధించిన ఈ ఘనత తెలంగాణ యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
