
DNews: Dec 11: హైదరాబాద్‌లోని రహమత్‌నగర్‌లోని SPR హిల్స్ గ్రౌండ్ వద్ద గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మూడు కార్లు, ఒక ఆటో పూర్తిగా దగ్ధమయ్యాయి. సమీపంలో నిలిపిన వాహనాలు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పోలీసులు రక్షణ చర్యలు చేపట్టి స్థానికులను అక్కడి నుంచి తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. గంజా ప్రభావంలో ఉన్న వ్యక్తి చెత్తకు నిప్పంటించడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
